రూ.21.9 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం 

Hyderabad: Heroin Worth Rs 21. 9 Crore Seized At RGIA - Sakshi

నైరోబీ నుంచి తీసుకొచ్చిన  మలావీ జాతీయురాలు... నిందితురాలిని అరెస్ట్‌ చేసిన డీఆర్‌ఐ అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌: డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు భారీ ఇంటర్నేషనల్‌ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టు చేశారు. కెన్యా రాజధాని నైరోబీ నుంచి హెరాయిన్‌తో వచ్చిన మలావీ దేశ జాతీయురాలిని సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఆమె నుంచి రూ. 21.9 కోట్ల విలువైన 3.129 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె క్యారియర్‌ అని, ఈ డ్రగ్‌ను తీసుకొనే రిసీవర్లు ఎవరనేది గుర్తించే కోణంలో దర్యాప్తు చేస్తు న్నామని డీఆర్‌ఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

పక్కా రెక్కీ అనంతరం... 
మలావీకి చెందిన మహిళను బిజినెస్‌ వీసాపై కొన్ని రోజుల క్రితం నైరోబీకి పిలిపించిన అంతర్జాతీయ డ్రగ్‌ మాఫియా... రెక్కీ కోసం అక్కడ నుంచి రెండుసార్లు ఆమెను హైదరాబాద్‌కు పంపి ఒకట్రెండు రోజుల తర్వాత తిరిగి వెనక్కు రప్పించింది. అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకున్న మాఫియా సూత్రధారులు శుక్రవారం 3.129 కేజీల హెరాయిన్‌ను ఆమెకు అప్పగించారు. దీన్ని రెండు పాలిథిన్‌ బ్యాగుల్లో ఉంచి ట్రాలీ బ్యాగ్‌ కింది వైపు ఏర్పాటు చేసిన రహస్య అరలో ఉంచారు. స్కానింగ్‌లోనూ హెరాయిన్‌ ఉనికి బయటపడకుండా నల్లరంగు పాలిథిన్‌ సంచులను వాడారు.

ఈ బ్యాగ్‌తో నైరోబీ నుంచి బయలుదేరిన మలావీ జాతీయురాలు తొలుత దోహాకు.. అక్కడి నుంచి సోమవారం శంషాబాద్‌కు చేరుకుంది. అయితే ఆమె బిజినెస్‌ వీసాపై నైరోబీ నుంచి రావడం, గతంలోనూ రెండుసార్లు వచ్చివెళ్లడంతో డీఆర్‌ఐ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని లగేజీని తనిఖీ చేయగా హెరాయిన్‌ లభ్యమైంది. ఆ మహిళను అరెస్టు చేసిన అధికారులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top