రాని కరోనాను రప్పించి మరీ..

Fraud In The Name Of Insurance Without Corona - Sakshi

కరోనా రాకున్నా, ఆస్పత్రిలో చేరకున్నా.. సొమ్ము స్వాహా

రెండు గ్రామాల్లోనే 800 మందితో బీమా చేయించిన ముఠా

పీహెచ్‌సీ, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తప్పుడు పాజిటివ్‌ సర్టిఫికెట్లు, చికిత్స బిల్లులు

వాటితో బీమా క్లెయిమ్‌లకు దరఖాస్తులు

రూ. 2.5 లక్షల చొప్పున 90 మంది ఖాతాల్లో రూ. 2.25 కోట్లు జమ

చివరికి అనుమానంతో విచారణ చేపట్టిన బీమా అధికారులు

కోవిడ్‌ బారినపడ్డ వారికోసం ప్రవేశపెట్టిన బీమా పథకంపై కొందరు కన్నేశారు. పది మంది కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రెండు గ్రామాల్లో వందల మందిని తీసుకెళ్లి బీమా చేయించారు. తర్వాత వారికి కరోనా వచ్చినట్టుగా, ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు తీసుకున్నట్టుగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లు సంపాదించారు. వాటిని సమర్పించి బీమా సొమ్ము క్లెయిమ్‌ చేయించడం మొదలుపెట్టారు. రూ.2.25 కోట్లదాకా వెనకేశారు. అనుమానం వచ్చిన బీమా సంస్థ రంగంలోకి దిగడంతో.. అసలు బాగోతం బయటపడింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో జరిగిన ఈ వ్యవహారం సంచలనంగా మారింది. 

కారేపల్లి: ఎవరైనా కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాల్సి వస్తే.. ఆ ఖర్చుల భారం నుంచి ఉపశమనం పొందేందుకు చాలా సంస్థలు కరోనా బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. అదే క్రమంలో ఎస్‌బీఐ లైఫ్‌ కరోనా రక్షక్‌ పేరుతో పాలసీని ప్రవేశపెట్టింది. అందులో రూ.5వేలు ప్రీమియం కడితే రూ.2.5 లక్షల బీమా ఉంటుంది. అయితే కోవిడ్‌ సోకి ఆస్పత్రిలో కనీసం మూడు రోజులపాటు చికిత్స తీసుకున్నవారికే ఈ సొమ్ము అందుతుంది. ఈ బీమా సొమ్మును కొల్లగొట్టేందుకు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బతండా గ్రామ పంచాయతీ, దాని శివారు గ్రామం మేకలతండాకు చెందిన పది మంది ఓ ముఠాగా ఏర్పడ్డారు.

ఈ రెండు గ్రామాల్లో కలిపి 1,200 మంది వరకు జనాభా ఉండగా.. ఏకంగా 800 మందిని గతేడాది సెప్టెంబర్‌లో కారేపల్లికి తీసుకెళ్లి ‘ఎస్‌బీఐ లైఫ్‌ కరోనా రక్షక్‌’పథకం కింద బీమా చేయించారు. ఆ సమయంలో ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల చొప్పున వసూలు చేశారు. ఇందులో రూ.5 వేలు ఇన్సూరెన్స్‌ కోసం, మిగతా సొమ్ము తప్పుడు సర్టిఫికెట్ల కోసం ఖర్చవుతుందని చెప్పారు. బీమా సొమ్ము రూ.2.5 లక్షలు ఖాతాల్లో జమకాగానే సదరు వ్యక్తులు రూ.లక్ష ఉంచేసుకుని, మిగతా రూ.1.5 లక్షలు తమకు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.10వేలు ఖర్చుపెడితే.. లక్ష రూపాయలు వస్తాయన్న ఆశతో చాలా మంది ముందుకొచ్చారు. 

ఆస్పత్రుల నుంచి బిల్లులు సంపాదించి.. 
ముఠా సభ్యులు స్థానిక పీహెచ్‌సీలోనైతే అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో పక్కనే ఉన్న గార్ల పీహెచ్‌సీ నుంచి సుమారు 500 మందికి తప్పుడు కరోనా పాజిటివ్‌ సర్టిఫికెట్లు సంపాదించారు. తర్వాత వీరంతా ఖమ్మంలోని వివిధ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మూడు రోజులకుపైన చికిత్స పొందినట్లు తప్పుడు బిల్లులు సంపాదించారు. ఆస్పత్రుల్లో సిబ్బందికి సొమ్ము ఆశచూపి మేనేజ్‌ చేశారు. ఆ తప్పుడు పత్రాల సాయంతో బీమా సొమ్ము కోసం దరఖాస్తులు చేయించారు. బీమా సంస్థ ఇటీవల 90 మంది క్లెయిమ్‌లను అంగీకరించి.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.2.5 లక్షల చొప్పున మొత్తంగా రూ.2.25 కోట్ల మేర జమచేసినట్టు తెలిసింది. 

భారీ క్లెయిమ్‌లపై అనుమానంతో.. 
ఒకే ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్కువగా పాజిటివ్‌ సర్టిఫికెట్లు ఉండడం, రెండు గ్రామాల నుంచే ఇంత భారీగా సొమ్ము కోసం క్లెయిమ్‌లు వస్తుండటంతో.. బీమా సంస్థ అధికారులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. ఈ విషయం బయటికి వచ్చి, స్థానికంగా చర్చనీయాంశం కావడంతో.. సదరు ముఠా సభ్యులు మిగతావారితో క్లెయిమ్‌ చేయించడాన్ని ఆపేసినట్టు సమాచారం.

మూడు వేవ్‌లలో కలిపి పాజిటివ్‌లు 280 మాత్రమే.. 
రెండు గ్రామాల్లో కరోనా కేసుల విషయమై గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా.. ఇప్పటివరకు మూడు వేవ్‌లలో కలిపి 280 వరకు మాత్రమే పాజిటివ్‌ కేసులు వచ్చి ఉంటాయని తెలిపారు. అంతకుమించి కేసులు నమోదుకాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏకంగా 800 మందికి కరోనా పాజిటివ్‌ సర్టిఫికెట్లు రావడం, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తప్పుడు బిల్లులు అందడం వెనుక ఎవరున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వస్తోంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top