ఇక్కడా ఓ డేరా బాబా!

Case registered against Fake Baba in Visakha Payakaravupeta - Sakshi

యువతీ యువకులను లోబర్చుకుని వికృత చేష్టలు

విశాఖ జిల్లా పాయకరావుపేటలో దొంగ బాబాపై కేసు నమోదు 

Fake Baba in Visakha Payakaravupeta: విశాఖ జిల్లా పాయకరావుపేటలో దేవుడి పేరుతో రాసలీలలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ కృష్ణలంకకు చెందిన అంబటి అనిల్‌ రైల్వేలో కారుణ్య నియామకం కింద టికెట్‌ కలెక్టర్‌గా చేరాడు. ఐదేళ్ల క్రితం బెజవాడ నుంచి విశాఖ జిల్లా పాయకరావుపేటకు మకాం మార్చి, ప్రేమదాసు పేరుతో బాబాగా మారాడు. భక్తుల నుంచి భారీగా విరాళాలు సేకరించి, పాయకరావుపేట శ్రీరంపురంలో అధునాతన భవంతి నిర్మించాడు.

యువతీ యువకులను లోబరుచుకొని ఆ భవనంలో వారితో వికృత చేష్టలకు పాల్పడేవాడు. అతని చేష్టలు భరించలేకపోయిన ఆ యువతి, మరికొందరు యువకులు గురువారం పాయకరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 376, 344, 354, 506, 493, 374, 312, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు పాయకరావుపేట సీఐ నారాయణరావు తెలిపారు. గురువారం రాత్రి నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠచందోల్‌ ఆ భవనాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న యువతుల నుంచి సీడీపీవో, పోలీసులు స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తున్నారు. వారిలో కొంతమంది ఇష్టపూర్వకంగా ఇక్కడ ఉంటున్నట్లు చెబుతున్నారు. 

స్పందించిన ఎమ్మెల్యే 
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వెంటనే స్పందించారు. సీఐ నారాయణరావు, తహసీల్దార్‌ పి.అంబేద్కర్, ఎంపీడీవో సాంబశివరావు, ఎస్‌ఐ  ప్రసాద్, సీడీపీవో నీలిమలతో సమావేశం  ఏర్పాటు చేశారు. వీరంతా ఒక కమిటీగా ఏర్పడి, భవనంలో ఉన్న వారిని బంధువులకు అప్పగించాలని ఆదేశించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top