ఉగ్రవాద ఆరోపణలపై డాక్టర్‌ రెహమాన్‌ అరెస్ట్‌

Bengaluru Doctor Arrested For Alleged ISIS Links - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్రవాద సంస్థతో సంబంధముందన్న ఆరోపణలతో  బెంగళూరుకు చెందిన ఒక కంటి డాక్టర్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు ఆరెస్ట్ చేశారు. ఐసిస్ కార్యకర్తలతో సంబంధాలు, ఉగ్రవాద కార్యకర్తలకు సహాయం చేయడానికి వైద్య, ఆయుధ సంబంధిత యాప్‌ను రూపొందించాడని ఎన్ఐఏ ఆరోపించింది.  ఐసిస్ అనుబంధ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) కేసును ఏజెన్సీ దర్యాప్తు సందర్భంగా, పక్కా సమాచారంతో  ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న అబ్దుర్‌ రహమాన్‌ (28)ను  అదుపులోకి తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. అతడినుంచి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు.

రెహమాన్‌ 2014లో సిరియాలోని ఐసిస్ మెడికల్ క్యాంప్‌ను సందర్శించి, అక్కడే 10 రోజుల ఉండి ప్రత్యేక శిక్షణ పొందినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. ఆ తర్వాత భారత్‌కు తిరిగొచ్చి ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. అలాగే మూడు ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి సోనియా నారంగ్ తెలిపారు. యుద్ధంలో గాయపడిన ఐసిస్ ఉగ్రవాదులకు మెడికల్ యాప్‌ ద్వారా వైద్య సాయం చేయడంతోపాటు  ఆయుధాల సమాచారానికి సంబంధించిన వివరాలతో మరో యూప్‌ను కూడా రూపొందిస్తున్నట్లు ఎన్ఐఏ తేల్చింది. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో అతడిని ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నామన్నారు.

కాగా విధ్వంసకర, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కశ్మీరీ దంపతులు జహన్‌జైబ్ సామి వాని, అతని భార్య హీనా బషీర్ బీగ్‌లను అరెస్టు చేసిన అనంతరం మార్చిలో ఐఎస్‌కేపీ కేసు నమోదైన సంగతి తెలిసిందే.  ఈ జంట ప్రస్తుతం తీహార్ జైలులో  ఉన్న ఐసిస్  అబుదాబి  సభ్యుడు అబ్దుల్లా బాసిత్‌తో సంప్రదింపులు జరిపినట్టు తేలింది. ఇప్పటికే  ఇతనిపై ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ  కేసు విచారణలో భాగంగా తాజా పరిణామం చోటు చేసుకుంది.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top