‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్‌’అంటే బాబు | Baby sales in code language | Sakshi
Sakshi News home page

‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్‌’అంటే బాబు

May 30 2024 4:59 AM | Updated on May 30 2024 6:50 AM

Baby sales in code language

కోడ్‌ భాషలో పసికందుల విక్రయాలు

ఉత్తరాది రాష్ట్రాల్లో హైదరాబాద్‌ పోలీసుల తనిఖీలు

ఢిల్లీ, యూపీ, పుణే నగరాల్లోని ముఠాపై ఆరా

సాక్షి, న్యూఢిల్లీ: పసికందుల విక్రయానికి అంతర్రాష్ట్రముఠా కోడ్‌ భాష వినియోగించినట్టు రాచకొండ పోలీసులు గుర్తించారు. పాపను ‘స్కూటీ’గా, బాబును ‘బైక్‌’గా పిలుస్తూ ఇలా కోడ్‌ భాష  ఎంచుకున్నట్లు స్పష్టమైంది. చిన్నారులను రాష్ట్రాలు దాటించి పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్న అంతర్రాష్ట్రముఠా గుట్టును  రాచకొండ పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే. 

ఈ వ్యవహారంలో పోలీసులు మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు. బుధవారం ఢిల్లీతోపాటు పుణే, యూపీ, నోయిడా, హరియాణాల్లోని పలు సిటీల్లో రాచకొండ పోలీసులు బృందాలుగా తనిఖీలు చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో కొందరిని అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలుస్తోంది.

వాట్సాప్‌లో మెసేజ్‌లు 
పాప కావాలి అంటే ‘స్కూటీ’ కావాలా?, బాబు కావాలి అంటే మీకు ‘బైక్‌’ కావాలా అని ముఠా సభ్యులు వాట్సాప్‌లో పిల్లలు లేని దంపతులకు మెసేజ్‌లు పంపేవారు. డైరెక్టుగా పాప కావాలా లేదా బాబు కావాలా అని మెసేజ్‌లు చేస్తే పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముఠాసభ్యులు ఈ కోడ్‌ భాషను వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు.

ఎవరైనా తెలియక పాప లేదా బాబు కావాలి అని మెసేజ్‌ చేస్తే వారికి వాట్సాప్‌ కాల్‌ చేసి మరీ ఈ కోడ్‌ భాష గురించి చెప్పేవారని, అనంతరం పిల్లలు లేని దంపతులు కూడా కోడ్‌ భాషను వినియోగించే వారని తెలిసింది. ఈరకంగా  పలు ప్రాంతాల్లో పసికందులను విక్రయించినట్టు సమాచారం. ప్రస్తుతం రాచకొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన వారి వివరాలతోపాటు వీరికి సంబంధించిన ప్రతి ఒక్క కదలికలపై  నిఘా పెంచారు. 

కొంతకాలంగా వీరు ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనే విషయాలను తెలుసుకున్నారు. వీటితో పాటు వాట్సాప్‌/టెలిగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికగా చాట్‌ చేసిన వివరాలు సేకరించారు. ఈ చాటింగ్‌లలో పోలీసులకు క్లూ లభించినట్టు తెలుస్తోంది. ఈ క్లూతోనే ఢిల్లీ, ఫుణే, హర్యానా వంటి ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు కొందరికి నోటీసులు కూడా జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం.ఆ చిన్నారులు మా వద్ద క్షేమంగా ఉన్నారు.

పెంపుడు తల్లిదండ్రులకు పిల్లలను ఇచ్చేది లేదు: కాంతి వెస్లీ
వెంగళరావునగర్‌(హైదరాబాద్‌): రాచకొండ పోలీసులు 11 మంది చిన్నారులను శిశువిహార్‌కు అప్పగించారని, వారంతా తమ వద్ద క్షేమంగా ఉన్నారని మహిళ,శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కాంతి వెస్లీ చెప్పారు.   బుధవారం కొందరు తల్లిదండ్రులు, మీడియా మహిళ, శిశు సంక్షేమశాఖ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూసినా ఎవరినీ లోపలకు అనుమతించలేదు. 

ఆ తర్వాత కాంతి వెస్లీ  బయటకు వచ్చి మీడియాకు పలు విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ చిన్నారులను విక్రయించడం, కొనడం చట్టరీత్యా నేరం.. వారికి కఠినశిక్షలు పడతాయని హెచ్చరించారు. ఆ విధంగా తీసుకొని పెంచుకోవడం కూడా తప్పేనన్నారు. చిన్నారులను కొని పెంచిన వారు ఇప్పుడు వచ్చి మా పిల్లలను మాకివ్వండి అని అడుగుతున్నారని, వారికి పిల్లలను ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదని తేల్చిచెప్పారు. 

అలాంటి తల్లిదండ్రులు ఎవరూ ఇక్కడకు రావొద్దని పేర్కొన్నారు. సంతానం లేనివారు ఎవరైనా పిల్లలు కావాలంటే మా వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకుంటే విచారణ అనంతరం దత్తత ఇస్తామన్నారు. పెంపుడు తల్లిదండ్రులు దత్తత కోసం  దరఖాస్తు చేసుకుంటే వారికి ఈ పిల్లలను మ్యాచ్‌ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement