
కార్ సన్‌రూఫ్‌లలో వేలాడుతూ ప్రయాణాలు
రోడ్లపై ఓవర్ హెడ్ బారికేడ్లతో పొంచి ఉన్న ప్రమాదం
వేలాడే కరెంట్, కేబుల్ వైర్లు, మాంజాలతో ప్రాణాలకే ముప్పు
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే జరిమానా తప్పదు
సోషల్ మీడియాలో రాచకొండ పోలీసుల అవగాహన
సాక్షి, హైదరాబాద్: ‘‘బెంగళూరులో ఓ బాలుడు కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. సన్‌రూఫ్‌లోంచి తల బయటికి పెట్టి వెళ్తుండగా.. డ్రైవర్ రోడ్డుపై ఉన్న ఓవర్ హెడ్ బారికేడ్‌ను గమనించకుండా అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అంతే అకస్మాత్తుగా బారికేడ్ బాలుడికి తగిలి తల పగిలిపోయింది.’’ అయితే ఈ ఘటన పొరుగు రాష్ట్రంలో జరిగినప్పటికీ.. మనకిదొక హెచ్చరిక! ఈ రోజుల్లో ప్రతి మోడ్రన్ కారుకు సన్‌రూఫ్ (Sunroof) తప్పనిసరి అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ సన్‌రూఫ్ అనుభూతిని పొందాలని భావిస్తున్నారు. అయితే ఆనందం మాటున ప్రమాదం కూడా పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చాలామంది యువతీ యువకులు సన్‌రూఫ్‌లోంచి బయటికి చూస్తూ వికృత చేష్టలకు పాల్పడుతుంటారు. సెల్ఫీలు దిగుతూ, రీల్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. పిల్లలను తిప్పడం, తిరగడం పేరెంట్స్‌కు ఓ సరదా, స్టేటస్ సింబల్. అయితే ఈ సరదా విషాదం కాకూడదని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సరదా కారాదు విషాదం..
ఇరుకు, బిజీ రోడ్లలో ఎత్తయిన వాహనాలు వెళ్లకుండా పోలీసులు ఓవర్ హెడ్ బారికేడ్లను ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి రోడ్లలో సన్‌రూఫ్ నుంచి వేలాడుతూ ప్రయాణించకూడదు. విద్యుత్ వైర్లు, టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు, పతంగుల దారాలు, మాంజా, ఇతరత్రా సన్నని తీగలు రోడ్లపై వేలాడుతుంటాయి. ఇది సాధారణంగా డ్రైవర్లకు కనిపించవు. దీంతో సన్‌రూఫ్‌లో ప్రయాణించే వారికి ఇవి తగిలి మెడ, తల, మొండెం భాగాలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది. అలాగే నడుం భాగం వరకూ బయట పెట్టి చేతులను ఊపుతూ ప్రయాణిస్తున్న క్రమంలో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే సన్‌రూఫ్‌లో ఉన్నవారికి పట్టు ఉండదు. దీంతో సన్‌రూఫ్ ఫ్రేమ్ తగిలి పక్కటెముకలు, ఊపిరితిత్తులకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. పొత్తి కడుపులో బలంగా తగిలితే తీవ్ర రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వంకలు, మూల వంపులు అధికంగా ఉన్న రోడ్లలో అయితే ఏకంగా కార్‌లో నుంచి కిందపడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
సహజ కాంతి కోసమే..
సన్‌రూఫ్ అనేది కేవలం వెంటిలేషన్ కోసమే ఉద్దేశించబడింది. కారు క్యాబిన్ స్పేస్ విశాలంగా అనిపించడంతో అత్యవసర పరిస్థితుల్లో కారు డోర్లు లాక్ అయిపోతే సన్‌రూఫ్ నుంచి బయటికి వెళ్లిపోవచ్చు. అంతేకాకుండా వేసవి కాలంలో ఎండలో కార్ పార్కింగ్ చేసినప్పుడు క్యాబిన్ చాలా వేడెక్కిపోతుంది. ఇలాంటి సమయంలో ఏసీ ఆన్ చేసి, సన్‌రూఫ్‌ను తెరిస్తే కారులోని వేడి గాలి బయటికి వెళ్లి, కార్ క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. ఇరుకైన రహదారులు, బిజీ రోడ్లలో సన్‌రూఫ్‌లను వినియోగించకూడదు. వీటిని హైవేలు, వెడల్పాటి రోడ్లపై మాత్రమే వినియోగించాలి.
జైలు, జరిమానా..
ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ ఉల్లంఘనల తరహాలోనే బిజీ రోడ్లపై సన్‌రూఫ్ వినియోగాన్ని కూడా తీవ్రమైన నేరంగా పరిగణించాలని ట్రాఫిక్ నిపుణులు సూచిస్తున్నారు. సన్‌రూఫ్‌లతో వ్యక్తిగతంగా ప్రాణాంతకమే కాకుండా రోడ్లపై ఇతర వాహనదారులకు అంతరాయం కలిగిస్తుంది. సన్‌రూఫ్, కారు కిటికీల నుంచి తలను బయటికి వేలాడుతూ ప్రయాణం చేస్తే భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్–281 కింద కేసులు నమోదు చేస్తారు. ఈ కేసులలో ఆరు నెలల వరకు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అలాగే ఇతర వాహనాల నుంచి వెళువడే పొగ, దుమ్ము ధూళి నేరుగా ముక్కులోకి వెళ్లి రోగాలకు కారణమవుతాయి.
చదవండి: జేఈఈ అడ్వాన్స్‌డ్ లేకుండానే.. ఐఐటీలో అడ్మిషన్!
ఆలోచింపజేసిన రాచకొండ పోస్టు
సన్‌రూఫ్ ప్రయాణం చాలా ప్రమాదం అంటూ రాచకొండ పోలీసులు అవగాహన కోసం సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు అందరినీ ఆలో చింపజేస్తోంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఆనందం కోసం ఇలా ప్రమాదకరంగా స్టంట్‌లు చేయొద్దంటూ బెంగళూరులో జరిగిన సన్‌రూఫ్ ప్రమాద ఘటన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లతో ఈ వీడియో హల్‌చల్ చేస్తుంది.