కల్తీలపై కొనసాగుతున్న దాడులు

Attacks continued for the third day in Guntur district for adulterated food items - Sakshi

గుంటూరు జిల్లా వ్యాప్తంగా వరుసగా మూడోరోజు కొనసాగిన దాడులు 

కల్తీ కారం, హోటళ్లు,చికెన్, మటన్‌ స్టాల్స్,పలు షాపుల్లో తనిఖీలు  

రూ.1.47 కోట్ల విలువైన కారం సీజ్‌ చేసిన అధికారులు 

ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ 

సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వ్యాపార సంస్థలపై తనిఖీలు చేసి కేసులు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. గత సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరుగుతున్న ఆహార కల్తీ వ్యాపారాలపై కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మూడోరోజు వరుసగా గుంటూరు జిల్లాలో నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వ్యాపార సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సివిల్‌ సప్లయిస్, ఫుడ్‌ సేఫ్టీ, రెవెన్యూ, కార్పొరేషన్, మునిసిపల్, లీగల్‌ మెట్రాలజీ అధికారులు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేశారు. పలు రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించి, సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.  

పలు షాపులు సీజ్‌.. జరిమానాల విధింపు 
జిల్లా వ్యాప్తంగా కారం మిల్లులు, హోటళ్లు, పచ్చళ్ల తయారీ దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, వాటర్‌ ప్లాంట్లు, సూపర్‌ బజార్లు, ఆయిల్‌ మిల్లులు, కిరాణా మాన్యుఫ్యాక్చరింగ్‌ షాపులు, పెట్రోలు బంకులు, చికెన్‌ సెంటర్లు, బిర్యాని పాయింట్లు, సినిమా థియేటర్లలో ఆహార పదార్థాలు, బేకరీలు, రైస్‌ మిల్లులు, స్వీట్, కూల్‌డ్రింక్‌ షాపులు, హోల్‌సేల్‌ మార్కెట్‌లు, మెస్‌లు మొత్తం 124 వ్యాపార సంస్థలపైన దాడులు చేశారు. తెనాలి సబ్‌ కలెక్టర్, డీఎస్‌వో పద్మశ్రీ, అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ షేక్‌ గౌస్‌మొహిద్దీన్, తూనికలు, కొలతలశాఖ అధికారి షాలెంరాజు, నగరపాలకసంస్థ సిబ్బంది, మునిసిపల్‌ కమిషనర్లు, తహసీల్దారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలు తనిఖీలు చేశాయి. మిర్చియార్డు రోడ్డులో ఐదు కారం మిల్లులు ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ఉల్లఘించి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించి ఆ మిల్లులను, రూ.1,47,90,000 విలువైన కారంపొడిని సీజ్‌ చేశారు. వేగస్‌ ట్రేడర్స్‌లో రూ.44,80,000 విలువైన 28,400 కిలోల కారంపొడి, వీరాంజనేయ ట్రేడర్స్‌లో రూ.14 లక్షల విలువైన 7 వేల కిలోలు, సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.27,80,000 విలువైన 13,900 కిలోలు, తులసి స్పైసెస్‌లో రూ.61,30,000 విలువైన 30,650 కిలోల కారాన్ని సీజ్‌ చేశారు.

ట్రేడ్‌ లైసెన్సు లేకుండా వ్యాపారం చేస్తున్న సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్, మహాలక్ష్మి, వీరాంజనేయ ట్రేడర్స్‌ వ్యాపార సంస్థలను సీజ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ వ్యాపారసంస్థల్లో కొలతల్లో తేడాలు, ఆహార పదార్థాల నాణ్యతలో తేడాలు, ఆయిల్‌లో కల్తీ, రెస్టారెంట్లో పాడై కుళ్లిపోయిన, నిల్వ ఉంచిన పదార్థాలను గుర్తించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ కల్తీకి పాల్పడిన వ్యాపారసంస్థలను సీజ్‌ చేయడంతో పాటు ఆహారభద్రత చట్టం, తూనికలు కొలతలశాఖ యాక్ట్, సివిల్‌ సప్లయిస్‌ యాక్ట్, ట్రేడ్‌ లైసెన్స్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు కల్తీ చేసి విక్రయిస్తున్న వారి సమాచారం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1902కి ఫోన్‌ చేసి చెబితే వెంటనే దాడులు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top