బిగ్‌ రిలీఫ్‌ | New GST slabs to be implemented from 22nd | Sakshi
Sakshi News home page

బిగ్‌ రిలీఫ్‌

Sep 19 2025 6:02 AM | Updated on Sep 19 2025 6:02 AM

New GST slabs to be implemented from 22nd

22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమలు

దసరా, దీపావళికి ముందే డబుల్‌ బొనంజా

పాత జీఎస్టీతో పోలిస్తే 10 శాతం మేర తగ్గనున్న ధరలు

దసరా, దీపావళి పండగ ఆనందాలు రెట్టింపు కానున్నాయి. ఇటీవల కేంద్రం సవరించిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబులు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గృహోపకరణాలు, ఆటో మొబైల్స్, ఎలక్ట్రానిక్‌ వంటి చాలా వరకు ఉత్పత్తుల ధరలు 10 శాతం మేర తగ్గనున్నాయి. 

గృహ నిర్మాణ భారం నుంచి ఉపశమనం కలగనుంది. దీంతో వాహనాలు, కార్లు, టీవీలు, సెల్‌ఫోన్లు వంటి ఉత్పత్తుల కొనుగోలుదారులు ఈనెల22 వరకు వాయిదా వేసుకుంటున్నారు. ఈ కామర్స్‌ సంస్థలు సైతం ఈనెల 22 తర్వాతే ఆఫర్లు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్లు, ఆన్‌లైన్‌ సంస్థల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.      – విశాఖ సిటీ

తగ్గనున్న నిత్యావసర ధరలు 
ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఉప్పు నుంచి పప్పు వరకు రేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో జీఎస్టీ సవరణలతో మరో వారం రోజుల్లో ఈ ధరలు దిగిరానున్నాయి. సాధారణ ప్రజలు నిత్యం వినియోగించే వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే జీఎస్టీ విధించారు. దీంతో పేస్ట్‌ నుంచి డ్రై ఫ్రూట్స్‌ వరకు ధరలు తగ్గనున్నాయి. 

వీటితో పాటు పన్నీర్, బ్రెడ్, వెన్న, నెయ్యి, పాస్తా, నూడుల్స్, కార్న్‌ఫ్లేక్స్, బిస్కెట్లు, కేకులు, స్వీట్లు వంటి ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాల ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఖరీదైన బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం వంటి వాటిపై కూడా జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గనుంది. ఇది సాధారణ ప్రజలకు భారీ ఉపశమనాన్ని అందించనుంది. 

వాహనాలపై 28 నుంచి 18 శాతానికి..   
వాహనాల ధరలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి కేంద్రం కుదించింది. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి. సాధారణంగా దసరా, దీపావళి పండగ సీజన్లలో వాహనాలను కొనుగోలు చేయడం సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. ఈ నెల 22వ తేదీ నుంచి బైక్‌లు, కార్లపై 10 శాతం వరకు ధరలు తగ్గే అవకాశాలు ఉండడంతో భారీగా వాహనకొనుగోళ్లు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే బైక్, కార్ల కంపెనీలు తగ్గించిన ధరలను ప్రకటించాయి. బైక్‌లపై రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు, మధ్యస్థాయి కారుపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ఉండనుంది. దీంతో కొనుగోలుదారులు ఈనెల 22 తర్వాతే వాహనాలను కొనుగోలు చేసేందుకు వాయిదా వేస్తున్నారు. అయితే కొన్ని షోరూమ్‌లు ప్రీ బుకింగ్‌లకు కూడా డిస్కౌంట్‌ ధరలు ప్రకటించాయి. లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధించారు. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ ఉన్న బైక్‌లు, ఇతర లగ్జరీ వస్తువులపై ప్రత్యేక, అధిక స్లాబ్‌ వడ్డించారు. 

గృహ నిర్మాణ భారం నుంచి ఉపశమనం 
జీఎస్టీ సంస్కరణలతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి మంచి రోజులు కనిపిస్తున్నాయి. బిల్డర్లతో పాటు సొంతింటి నిర్మాణాలు చేపట్టే ప్రజలకు నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది. దీంతో ఫ్లాట్లు, ఇళ్ల ధరలు తగ్గనున్నాయి. నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్బుల్స్, టైల్స్, రంగుల ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. 

సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40–45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో డెవలపర్‌కు 10–15 శాతం వరకు ఆదా అవుతుంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4–6 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది. 

ఈ–కామర్స్‌లో ఆఫర్ల వెల్లువ 
ఈ–కామర్స్‌ సంస్థల్లో కూడా డిస్కౌంట్ల సందడి మొదలైంది. ఈ నెల 22వ తేదీ నుంచి అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’, ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ పేర్లతో భారీ సేల్‌కు సిద్ధమవుతున్నాయి. ఇక మింత్రా, మీషో, షాపి వంటివి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. జీఎస్టీ సవరణలతో ఈ నెల 22వ తేదీ నుంచి అన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్ల వర్షం కురిపించనున్నాయి. 

ఎల్రక్టానిక్‌ వస్తువుల ధరలు సైతం.. 
జీఎస్టీ సవరణతో ఎల్రక్టానిక్‌ ఉపకరణాలు ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. ఇప్పటి కంటే 10 నుంచి 13 శాతం మేర ధరలు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఏసీలు ఇలా అన్ని రకాల ఎల్రక్టానిక్‌ వస్తువుల ధరల్లో వ్యత్యాసం భారీగా ఉండే అవకాశం ఉంది. 

వీటితో పాటు సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు కూడా అందుబాటు ధరల్లోకి రానున్నాయి. టీవీలపై రూ.5 వేలు నుంచి రూ.15 వేలు వరకు, మొబైల్‌ ఫోన్లపై రూ.2 వేలు నుంచి రూ.5 వేలు, ఫ్రిజ్, వాషింగ్‌ మెషీన్లపై రూ.7 వేలు నుంచి రూ.10 వేలు వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. 

సాధారణంగా దసరా, దీపావళి సమయాల్లో ఎల్రక్టానిక్, వస్తువులపై వ్యాపారులు ప్రత్యేక డిస్కౌంట్లు, బహుమతులు ఇస్తుంటారు. ఈ ఏడాది మాత్రం వ్యాపారుల ఆఫర్లతో పాటు కేంద్రం జీఎస్టీ రూపంలో కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది. దీంతో ప్రజలు ఈ నెల 22వ తేదీ తర్వాతే గృహోపకరణాలు, మొబైల్స్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement