వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధిపై హత్యాయత్నం

Assassination Attempt on Malla Bullibabu In Visakhapatnam - Sakshi

మళ్ల బుల్లిబాబుపై హత్యాయత్నంతో 

ఉలిక్కిపడ్డ కశింకోట త్రుటిలో తప్పిన ప్రాణప్రమాదం 

కొద్ది రోజులుగా నిందితుల రెక్కీ?  

సాక్షి,విశాఖపట్నం: నిత్యం ప్రజల మధ్య ఉండే వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబుపై హత్యా యత్నం జరిగిందన్న వార్త తెలుసుకొని స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అప్పటి వరకు ఆయనతో తిరిగిన అనుచరులు, ఆయనను చూసిన స్థానికులు శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో నిశ్చేష్టులయ్యారు. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో గతంలో ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు. గవరపేటలో ఉన్న తన ఇంటి నుంచి సాయంత్రం 5.30 గంటల సమయంలో బైక్‌ పై ఒంటరిగా ఆయన బయలుదేరారు. శారదానది అవతల పొలాల్లో నిర్మించుకుంటున్న అతిథి గృహానికి వెళుతుండగా.. సమీపంలో నది వంతెన అవతలకు చేరే సరికి గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చే శాడు.

మెడపై కత్తితో నరకడానికి ప్రయత్నించగా బుల్లిబాబు తన చేతులతో అడ్డుకున్నారు. దీంతో చేతి వేళ్లు రెండు తెగిపడ్డాయి. మరో రెండు వేళ్లకు తీ వ్రగాయమైంది. తలపైన కూడా బలమైన గాయం తగిలింది. చేతిని అడ్డుపెట్టకపోతే మెడపై తగిలి ప్రాణానికి ప్రమాదం జరిగి ఉండేదని సమాచారం. సంఘటన అనంతరం అగంతకుడు పరారయ్యాడు. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా కొత్త వ్యక్తులు తచ్చాడుతున్నట్టు స్థానికులు చెప్పారు. రెక్కీ నిర్వహించి, పకడ్బందీగా పథకం ప్రకారం హత్యకు యత్నించినట్టు తెలుస్తోంది.  సమాచారం తెలిసిన వెంటనే ఎస్‌ఐ సురేష్‌కుమార్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు. కశింకోటలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న బుల్లిబాబు ఇంటికి అభిమానులు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. 

నిందితుడి గుర్తింపు
కంచిపాటి నాగ ఉదయ్‌ సాయి హత్యాయత్నానికి పాల్పడినట్టు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశామని అనకాపల్లి సీఐ జి. శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి విలేకరులకు తెలిపారు. ఈ సంఘటనలో ఒకరే హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పారు. సాయి భార్య గ్రామ వలంటీర్‌గా గతంలో పనిచేసేవారు. ఆమెను ఇటీవల తొలగించారు. ఇందుకు బుల్లిబాబు కారణమని అపోహతో హత్యాయత్నానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. 

పరామర్శించిన ఎమ్మెల్యే అమర్, రత్నాకర్‌ 
అనకాపల్లి టౌన్‌: బుల్లిబాబు చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆస్పత్రికి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ పరిశీలకుడు దాడి రత్నాకర్‌ హుటాహటిన వెళ్లారు. ఆయన పరి స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ ఆస్పత్రికి తరలించారు. పార్టీ నేతలు మందపాటి జానకీరామరాజు, గొర్లి సూరిబాబు బుల్లిబాబును పరామర్శించారు.

చదవండి: చిట్టీ డబ్బులు అడిగినందుకు .. ఒంటిపై పెట్రోల్‌ పోసి..

మంత్రి ముత్తంశెట్టి పరామర్శ  

ఆరిలోవ: విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత మల్ల బుల్లిబాబు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ పరామర్శించారు. బుల్లిబాబు ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడ వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top