పెనమలూరు తహసీల్దార్‌పై ఏసీబీ కేసు 

ACB case against Penamalur Tehsildar Bhadru - Sakshi

పెనమలూరు/రెడ్డిగూడెం/ఎ.కొండూరు: కృష్ణా జిల్లా పెనమలూరు తహసీల్దార్‌ జి.భద్రుపై అవినీతి నిరోధకశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదుతో శుక్రవారం ఏకకాలంలో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి రూ.రెండుకోట్ల ఆస్తులు గుర్తించారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. తహసీల్దార్‌ జి.భద్రు అక్రమార్జన, అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో కోర్టు నుంచి సెర్చ్‌ వారెంట్‌ తీసుకుని ఆయన కార్యాలయంతోపాటు కానూరులోని మనోహరి అపార్టుమెంట్‌లో ఆయన నివసిస్తున్న ఫ్లాట్, గుంటుపల్లి, పోరంకి, కొండపల్లి, ఎ.కొండూరు మండలం కుమ్మరికుంట్ల, రెడ్డిగూడెం మండలం కుదప తండా తదితర ప్రాంతాల్లోని బంధువులు, మిత్రుల ఇళ్లలో సోదాలు చేశారు.

భద్రు పేరున ఒక ఫ్లాట్, ఒక ఇల్లు, ఒక ఖాళీస్థలం, 17.35 ఎకరాల వ్యవసాయ భూమి, విలాసవంతమైన కారు, రెండు మోటారు సైకిళ్లు, బంగారం, వెండి కలిపి మొత్తం రూ.2,54,90,170 విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. వీటిలో రూ.2 కోట్ల మేర అక్రమాస్తులని నిర్ధారించారు. కుదప తండాలో భద్రు బావమరుదులు, స్నేహితుల నివాసాల్లో ఏసీబీ సీఐలు సీహెచ్‌.రవిబాబు, వి.సురేష్‌బాబు తొమ్మిదిచోట్ల తనిఖీలు చేశారు. పలు రికార్డులు, ఆస్తుల వివరాలు పరిశీలించారు. కుమ్మరికుంట్లలో భద్రు సోదరుడు జి.చంటి ఇంట్లో భద్రు కుటుంబానికి సంబంధించిన విలువైన ఒరిజినల్‌ డాక్యుమెంట్లను గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ సోదాలు జరిగాయి. సుమారు రూ.30 లక్షల ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ సీఐ నాగరాజు తెలిపారు. సోదాలు పూర్తయిన తరువాత అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. 

జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి.. 
ఎ.కొండూరు మండలం కుమ్మరికుంట్లకు చెందిన భద్రు రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేరి.. క్రమంగా డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగోన్నతి పొందారు. 2011లో తహసీల్దార్‌ అయ్యారు. మొవ్వ, తోట్లవల్లూరు, ఉయ్యూరు మండలాల్లో పనిచేశారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top