breaking news
penamalaru
-
పెనమలూరు తహసీల్దార్‌పై ఏసీబీ కేసు
పెనమలూరు/రెడ్డిగూడెం/ఎ.కొండూరు: కృష్ణా జిల్లా పెనమలూరు తహసీల్దార్ జి.భద్రుపై అవినీతి నిరోధకశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదుతో శుక్రవారం ఏకకాలంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి రూ.రెండుకోట్ల ఆస్తులు గుర్తించారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. తహసీల్దార్ జి.భద్రు అక్రమార్జన, అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని ఆయన కార్యాలయంతోపాటు కానూరులోని మనోహరి అపార్టుమెంట్లో ఆయన నివసిస్తున్న ఫ్లాట్, గుంటుపల్లి, పోరంకి, కొండపల్లి, ఎ.కొండూరు మండలం కుమ్మరికుంట్ల, రెడ్డిగూడెం మండలం కుదప తండా తదితర ప్రాంతాల్లోని బంధువులు, మిత్రుల ఇళ్లలో సోదాలు చేశారు. భద్రు పేరున ఒక ఫ్లాట్, ఒక ఇల్లు, ఒక ఖాళీస్థలం, 17.35 ఎకరాల వ్యవసాయ భూమి, విలాసవంతమైన కారు, రెండు మోటారు సైకిళ్లు, బంగారం, వెండి కలిపి మొత్తం రూ.2,54,90,170 విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. వీటిలో రూ.2 కోట్ల మేర అక్రమాస్తులని నిర్ధారించారు. కుదప తండాలో భద్రు బావమరుదులు, స్నేహితుల నివాసాల్లో ఏసీబీ సీఐలు సీహెచ్.రవిబాబు, వి.సురేష్‌బాబు తొమ్మిదిచోట్ల తనిఖీలు చేశారు. పలు రికార్డులు, ఆస్తుల వివరాలు పరిశీలించారు. కుమ్మరికుంట్లలో భద్రు సోదరుడు జి.చంటి ఇంట్లో భద్రు కుటుంబానికి సంబంధించిన విలువైన ఒరిజినల్ డాక్యుమెంట్లను గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ నాగరాజు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ సోదాలు జరిగాయి. సుమారు రూ.30 లక్షల ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ సీఐ నాగరాజు తెలిపారు. సోదాలు పూర్తయిన తరువాత అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి.. ఎ.కొండూరు మండలం కుమ్మరికుంట్లకు చెందిన భద్రు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి.. క్రమంగా డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగోన్నతి పొందారు. 2011లో తహసీల్దార్ అయ్యారు. మొవ్వ, తోట్లవల్లూరు, ఉయ్యూరు మండలాల్లో పనిచేశారు. -
పెనమలూరు నుంచే పోటీ చేస్తా : సారథి
తోట్లవల్లూరు/పెనమలూరు, న్యూస్‌లైన్ : రాబోయే ఎన్నికల్లో తాను పెనమలూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మండలంలోని వల్లూరుపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, సర్పంచ్ మాదల రంగారావు ఇంట్లో వివాహ కార్యక్రమంలో, పెనమలూరు మండలం తాడిగడపలో వంతెన ప్రారంభోత్సవంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రయోజనాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయం బాధ కలిగిస్తోందన్నారు. పార్లమెంటులో బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని విభజించటం దారుణమన్నారు. సీఎం కిరణ్ కొత్త పార్టీపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. ఆదివారం జరిగే సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశముందన్నారు. హైదరాబాద్‌లా సీమాంధ్ర రాజధానిని అభివృద్ధి చేయటం ఇప్పట్లో సాధ్యపడేపని కాదన్నారు. రాజధానికి విజయవాడ అనుకూలం... విజయవాడ నగరం రాజధానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని సారథి చెప్పారు. అతి పెద్ద రైల్వే జంక్షన్, ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న విమానాశ్రయం, విజయవాడను తాకుతూ వెళుతున్న ప్రధాన రహదారులు, నీటి వసతి, అభివృద్ధి చేసుకుంటే అందుబాటులో ఉన్న మచిలీపట్నం పోర్టు వంటి సౌకర్యాలు మనకు ఉన్నాయన్నారు. ఆగిరిపల్లి, ముసునూరు, బాపులపాడు మండలాల్లో సుమారు 18 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయని, రాజధాని నిర్మాణానికి అన్ని విధాలా విజయవాడ అనుకూలంగా ఉంటుందని ఆయన వివరించారు. వైద్య రంగంలో కూడా విజయవాడ హైదరాబాద్‌కు దీటుగా ఉందన్నారు. ఇక్కడ కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు రూ.150 కోట్లు ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించినట్లు చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని అడగగా కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ఒక అవగాహనకు రానున్నట్లు వెల్లడించారు.