
రెండు దుకాణాల్లో చోరీ
పుత్తూరు: డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే రెండు దుకాణాల్లో గురువారం రాత్రి చోరీ చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని శ్రీమారుతీ ఎంటర్‌ప్రైజెస్ దుకాణం పైకప్పులోని రేకును కత్తిరించి దుండగుడు లోనికి ప్రవేశించాడు. దుకాణం లోపల అమర్చిన సీసీ కెమెరాను ఆఫ్ చేసి అనంతరం గల్లాలోని రూ.25 వేల నగదును దోచుకెళ్లాడు. సమీపంలోనే ఉన్న ఇలియాస్ కూల్‌డ్రింక్స్ షాపు పైభాగం నుంచి లోనికి ప్రవేశించిన దుండగుడు గల్లాలోని రూ.5 వేలు అపహరించాడు. రెండు దుకాణాల్లోనూ ఒకే వ్యక్తి చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించగా దుండగుడు మాస్క్ వేసుకొని లోపలికి ప్రవేశించినట్లు తెసుస్తోంది. సదరు దుండగుడు తమ షాపులో పనిచేసి నిలిచి పోయిన వ్యక్తిగా ఎంటర్‌ప్రైజెస్ యజమాని కళ్యాణి తెలిపారు. ఈ ఏడాది జనవరిలోనూ ఇలాగే దొంగతనం జరిగిందని, అప్పుడు కూడా రూ.లక్ష దోచుకెళ్లారని ఆమె వాపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు దుకాణాల్లో చోరీ