
ఆయుష్ సేవలు మరింత బలోపేతం
– తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
తిరుపతి మంగళం : జిల్లాలో ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంటులో ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలపై వివరాలు తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, ఆయుష్ రంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల తీసుకునే చర్యలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా గత ఐదేళ్లలో రూ.28.82 కోట్ల మేర కేంద్రం నిధులు విడుదల చేసినట్లు మంత్రి తెలిపినట్లు వివరించారు. ఈ నిధులతో కాకినాడ, విశాఖపట్నంలో 50 పడకల సమీకృత ఆయుష్ ఆస్పత్రుల ఏర్పాటు చేయాలని, మరో నాలుగు ఆయుష్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇచ్చిందని చెప్పారు. తిరుపతి ఆయుష్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఎంపీ గురుమూర్తి కోరారు.