
జరుగుతున్న పనులకు టెండర్లు!
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు కాస్త ఆలస్యంగా మేల్కొన్నారు. నగరంలో పలుచోట్ల రోడ్లు, ఇతర సివిల్ పనులకు టెండర్లు పిలవకుండానే పనులు అప్పగించడంపై ‘సాక్షి’లో రెండు రోజుల క్రితం ‘టెండర్ లేకుండా పనులా..?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. చేయికాలాక ఆకులు పట్టుకున్నట్లు.. కలెక్టర్ బంగ్లాలో ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తయిన ప్రహరీ గోడ నిర్మాణానికి గురువారం రూ.39 లక్షల అంచనాలతో టెండర్లు పిలిచారు. కార్పొరేషన్ సాధారణ పద్దుల నుంచి పనులు చేయడానికి పిలిచిన టెండర్‌కు ఆగస్టు 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ప్రహరీ గోడ పూర్తవుతున్న నేపథ్యంలో అధికారులు చేస్తున్న పనులు చూసి జనం నవ్వుకునే పరిస్థితి నెలకొంది. ఇక ఆర్టీసీ బస్టాండులో టెండరు పిలవకుండానే ఫుట్‌పాత్ పనులు చేయడంపై.. స్థానిక ఎమ్మెల్యే కార్పొరేషన్ అధికారులను మందలించినట్లు తెలిసింది. దీంతో ఫుట్‌పాత్ నిర్మాణం కోసం ఉంచిన ఇనుప కమ్మీలను పక్కకు తీసేసిన అధికారులు, అక్కడ ఎవరూ పనులు చేయకుండా రిబ్బన్ ఏర్పాటు చేశారు.

జరుగుతున్న పనులకు టెండర్లు!