తవణంపల్లె: ప్రభుత్వ పాఠశాలల్లో తప్పని సరిగా గ్యాస్‌తోనే వంటలు చేసి పెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి మధ్యాహ్న భోజన నిర్వాహకులను, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని తొడతర హైస్కూల్, తొడతర మోడల్ స్కూల్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొడతర హైస్కూల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రధానోపాధ్యాయుడికి, ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికర భోజనాలు పెట్టాలన్నారు. కట్టెలతో వంటలు చేయరాదన్నారు. అనంతరం తొడతర ప్రాథమిక మోడల్ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని సూచించారు. డీఈఓతో పాటు ఎంఈఓలు హేమలత, మోహన్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.