
న్యాయం చేయకపోతే ఉద్యమమే
చిత్తూరు కలెక్టరేట్ : ఏకీకృత సర్వీసు రూల్స్ విషయంలో న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరోత్తమరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఒకే డీఎస్సీ, ఒకే విధమైన ఉద్యోగం, ఒకే రకమైన జీతం అన్నింటా ఒకటే కానీ ఉద్యోగోన్నతుల్లో ఎందుకు వ్యతాసమని ప్రశ్నించారు. ఎప్పుడో బ్రిటీష్‌ల కాలంలో రూపొందించిన ప్రభుత్వ జీవోలను నేడు అమలు చేయడం హాస్యాస్పదమన్నారు. మొట్టమొదట ఏర్పాటు చేసిన పాఠశాలలు అన్ని ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఏర్పాటు చేయలేదన్నారు. లోకల్ బాడీల పేరుతో ప్రపంచ బ్యాంకు షరతులతో ఒప్పందాలకు అనుకూలంగా జిల్లా పరిషత్, మున్సిపల్, రెసిడెన్షియల్, మోడల్ పాఠశాలల పేరుతో అనేక రకాలుగా పాఠశాలలు నెలకొల్పారని తెలిపారు. 1994 నుంచి ఒకే రకమైన డీఎస్సీ నిర్వహిస్తున్నారన్నారు. ఆ డీఎస్సీలలో ఎంపికయ్యే వారిని స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలను నియమిస్తున్నారన్నారు. ఏకీకృత సర్వీసు నిబంధనలను రాష్ట్రపతి ఆర్డినెన్స్ తెచ్చే వరకు తీసుకెళ్లి, పార్లమెంట్‌లో చట్టం చేయకుండా వదలడం వల్ల ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఇప్పుడు ఒకే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండడం వల్ల ఏకీకృత సర్వీస్ నిబంధనలను పార్లమెంట్‌లో చట్టం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. స్కూల్ అసిస్టెంట్‌ల ఓట్లతో గెలుపొందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఈ విషయంలో చొరవ చూపాలన్నారు. స్కూల్ అసిస్టెంట్‌ల ఏకీకృత సర్వీస్ నిబంధనలతో హెచ్‌ఎంలు, డైట్, ఎంఈవోలు, హైస్కూల్ ప్లస్, జూనియర్ కళాశాలల లెక్చరర్‌ల ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధపడుతామని ఆయన హెచ్చరించారు.