
పురోగతిలో అలసత్వం వహిస్తే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో పలు శాఖలతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాల్లో వారాంతపు లక్ష్యాలను కచ్చితంగా చేరుకోవాలన్నారు. హౌసింగ్ కాలనీల్లో అన్ని మెరుగైన వసతులు కల్పించాలన్నారు. గృహ నిర్మాణాల్లో ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనపు సాయం పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 2,11,628 మంది రైతులు అర్హులుండగా, ఇప్పటి వరకు 2,04,971 మందికి ఈకేవైసీ పూర్తి చేశారన్నారు. 6,644 మందిని తిరస్కరించడం జరిగిందన్నారు. అర్హత పొందిన ప్రతి రైతుకూ సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థిక సహాయం ఇస్తారన్నారు. ఇందులో కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా మరో రూ.14 వేలు ఉంటుందన్నారు. మొదటి విడతలో రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు చొప్పున ఈ నెల 2వ తేదీన మంజూరు చేస్తారన్నారు. అర్హుల జాబితా రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ, హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.