
అవయవదానంపై అవగాహన అవసరం
చిత్తూరు కలెక్టరేట్ : అవయవదానం పట్ల విద్యార్థులకు అవగాహన అవసరమని అపోలో యూనివర్సిటీ ఫిజియోథెరపీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.రమ్యకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గురువారం పీసీఆర్, పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాలల్లో అంగ్‌దాన్–జీవదాన్ అనే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ అవయవదానం అంటే కేవలం శరీర భాగాలను మాత్రమే ఇవ్వడం కాదన్నారు. ఒక మనిషి మృతి చెందిన తర్వాత కూడా, అతని అవయవాలు మరొకరికి జీవితం ఇస్తాయన్నారు. అలైడ్ హెల్త్ సైన్సెస్ విభాగం అధ్యాపకులు అశోక్‌రెడ్డి మాట్లాడుతూ హృదయ స్పందన అర్ధంతరంగా ఆగిపోవచ్చు కానీ కాసింత ఆలోచన చేస్తే మరో మనిషి పంచన చేరి ఆ గుండే చేసే చప్పుడు వినవచ్చన్నారు. ప్రయాణం సగంలోనే ఆగిపోవచ్చు కానీ మిగిలిపోయిన ఆ ప్రయాణాన్ని అవయవదానంతో మరొకరి సాయంతో పూర్తిచేయొచ్చని పేర్కొన్నారు. ఒక మనిషి మృతి చెందినా మళ్లీ బతకవచ్చంటే అది కచ్చితంగా అవయవదానం వల్లే సాధ్యమవుతుందన్నారు. మృతి చెందిన అనంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, జీర్ణవ్యవస్థలోని ప్యాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చని తెలిపారు. బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి అవయవాలు సేకరిస్తారన్నారు. అవయవదానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తమకు తెలిసిన వారందరికీ సమాచారం అందివ్వాలని తెలిపారు. అవయవదానం పై ఇప్పటికీ పలువురిలో అపోహలున్నాయన్నారు. ప్రచారం లేకపోవడంతో అవగాహన పెరగడం లేదన్నారు. అవగాహన పెంచేందుకు అపోలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనంతరం అవయవదానం ఎలా చేయాలి ? ఎవరెవరికి సాధ్యం ? నిబంధనలు ఏమిటి ? అనే అంశాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ డా.హసీనా, స్టూడెంట్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.