
యంత్రాలతో వ్యవసాయం సులభం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): యంత్ర పరికరాలతోనే వ్యవసాయ రంగాన్ని మరింత వృద్ధి చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. చిత్తూరు మండలం, తుమ్మింద గ్రామంలో గురువారం దక్షిత క్షేత్ర వ్యవసాయ యంత్రాల శిక్షణ, పరిరక్షణ సంస్థ అనంతపురం వారి ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పరికరాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి యంత్రాల ఎంపిక, మరమ్మతులు, వాటి ఉపయోగాలు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న వివిధ యాంత్రీకరణ పనిముట్ల మన్నికను పరీక్షించి వినియోగదారులకు నాణ్యమైన పరికరాలు అందేటట్లు చూస్తామన్నారు. కార్యక్రమంలో స్కిల్ డెవలెప్‌మెంట్ అధికారి గుణశేఖర్‌రెడ్డి, భాస్కర్, మండల వ్యవసాయశాఖ అధికారి వేణు పాల్గొన్నారు.