
ప్రతిష్టాత్మకంగా ఎన్‌సీడీ సర్వే
బంగారుపాళెం: నాల్గవ విడత ఎన్‌సీడీ 4.ఓ సర్వే(నాన్‌కమ్యూనికబుల్ డిసీజస్)ని మరింత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఐసీఎంఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ లోకేష్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త డాక్టర్ పద్మాంజలిదేవి ఆదేశించారు. గురువారం బంగారుపాళెంలోని ప్రభుత్వాస్పత్రిని వారు సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలోని ప్రసూతివార్డు, ల్యాబ్, ఫార్మసీ, ఫిజియోథెరపీ, ఎయిడ్స్ పరీక్ష, చికిత్స కేంద్రం, క్షయ నివారణ కేంద్రాలను పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరాతీశారు. ఎన్‌సీడీ వ్యాధులంటే ఒకరి నుంచి మరొక్కరికి సంక్రమించని జబ్చులని తెలిపారు. బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ, ఊపిరితిత్తుల జబ్బులు, క్యాన్సర్, లివర్, నరాల బలహీనత, కీళ్ల జబ్బులు, మానశిక వ్యాధులు వంటివి ఎన్‌సీడీ కిందకు వస్తాయన్నారు. ఇప్పటి వరకు మూడు వితలు సర్వే చేశారని, ప్రభుత్వం మరింత నిర్మాణాత్మకంగా 4.ఓ తీసుకొచ్చిందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పటిష్టంగా సర్వే చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శిరీషా, డాక్టర్లు శాలిని, విజయకుమారి, స్వరూప్‌నాయక్, చంద్రమోహన్, జశ్వంత్‌రాయల్ పాల్గొన్నారు.