
ఆలయ పనులపై పెత్తనం
● ఆలయ పునఃనిర్మాణ పనులను అడ్డుకున్న టీడీపీ నేత ● ఎమ్మెల్యే అనుమతి లేకుండా పనులొద్దంటూ హెచ్చరికలు ● మాజీ ఎమ్మెల్యే సొంత నిధులతో ఆలయ నిర్మాణం ● జనంలో పేరొస్తుందని అడ్డగింత ● ఆగిన చౌడేశ్వరమ్మ ఆలయ పునఃనిర్మాణ పనులు
పలమనేరు/వీకోట : ఆ గ్రామంలో పురాతన ఆలయం. గతంలో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు దూప దీప నైవేద్యాలకు దూరమైంది. ఆ ఆలయాన్ని పునఃనిర్మించాలని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ పూనుకున్నారు. గ్రామపెద్దల ఆదేశాల మేరకు కోటి రూపాయలతో సొంతంగా ఆలయ పనులు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయం వద్ద పనులు చేస్తుండగా మాజీ ఎమ్మెల్యేకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని భయపడిన ఆ మండల టీడీపీ నేతలు గుడి నిర్మాణ పనులను చేయొద్దంటూ బెదిరింపులకు దిగారు. దీంతో పనులు ఆగిపోయాయి. ఈ సంఘటన పలమనేరు నియోజకవర్గంలోని వీకోట మండలం తోటకనుమ గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది.
పురాతన చౌడేశ్వరి ఆలయం
తోటకనుమ గ్రామంలో 50 ఏళ్ల కిందట చౌడేశ్వరీదేవి, పటాలమ్మ దేవతగా పిలువబడే ఆలయం ఉంది. ఇక్కడ తరచూ పూజలు విజయ దశమికి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఆలయానికి వంశపారంపర్య అర్చక కుటుంబం కూడా ఉంది. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వెంకటేగౌడ గత ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆ ప్రాంత వాసులు ఆలయాన్ని పునఃనిర్మించాలని కోరారు.
స్థానిక ఎమ్మెల్యే విల్లింగ్ లెటర్ లేదని..
ఆలయాన్ని నిర్మించాలంటే ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి విల్లింగ్ లెటర్ లేదనే సాకుతో ఈ పనులకు కుటమి పాలనలో అక్కడి నేతల ద్వారా బ్రేక్ పడింది. దీనిపై గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యేను సంప్రదించడంతో ఆయన రూ.కోటి నిధులతో తాను, దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఈ ఏడాది మే నెల 26న తాను చెల్లించిన కాంట్రిబ్యూషన్ డబ్బును వెనక్కివ్వాలని తామే సొంతంగా ఆలయాన్ని నిర్మించుకుంటామని ఎండోమెంట్ అధికారులకు లేఖ రాశారు. దీనిపై 11.06.25 చిత్తూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ వారు ఆ శాఖ కమిషనర్‌కు లెటర్ పెట్టారు. ఇందుకు సంబంధించిన ప్రొసెస్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
ఎండోమెంట్ నుంచి
ఆలయ నిర్మాణానికి చర్యలు
గ్రామస్తుల విన్నపం మేరకు మాజీ ఎమ్మెల్యే 08.01.24లో ఎండోమెంట్ వారికి ఆలయ నిర్మాణం కోసం అనుమతి కోరారు. దీనిపై ప్రొసెస్ జరిగింది. గుడి నిర్మాణానికి రూ.కోటి అవసరం అవుతుందని ఇందు కోసం సీజీఎఫ్ (కామన్‌గుడ్‌ఫండ్) ద్వారా కాంట్రిబ్యూషన్‌గా రూ.15 లక్షలు జాయింట్ ఖాతాగా చెల్లించాలని ఎండోమెంట్ నుంచి ఆదేశాలందాయి. ఆ మేరకు ఆలయ చెర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆ డబ్బును యూబీఐ బ్యాంకులో జమ చేసి ఇందుకు సంబంధించిన ఫైల్‌ను పంపారు. ఈ తరుణంలోనే ఎన్నికలు రావడంతో నోటిఫికేషన్ దశలో ఈ ప్రక్రియ ఆగిపోయింది.
ఆలయ నిర్మాణంలో రాజకీయ జోక్యం
తమ సొంత గ్రామంలో అమ్మవారి గుడి పునర్ నిర్మాణం కోసం గతంలో ఎండోమెంట్ ద్వారా ప్రయత్నించాం. కుదరకపోవడంతో తాను దాతల సాయంతో ఆలయాన్ని నిర్మించేందుకు ఎండోమెంట్‌తోనూ పనిలేదు. కానీ ఎక్కడ మాకు మంచి పేరొస్తుందోనని వీ కోటకు చెందిన టీడీపీ నేత రంగనాథ్ ఆలయ పనులు నిలిపేయాలని, ఏ పని కావాలన్నా స్థానిక ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాలని చెప్పడం బాధాకరం. దీన్నంతా జనం చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని ఆ చౌడేశ్వరమ్మే చూసుకుంటుంది.
– వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు
సొంత నిధులతో నిర్మిస్తే పేరొస్తుందని..
ఎండోమెంట్ ద్వారా కాకుండా ఆలయ నిర్మాణాన్ని సొంతంగా చేపట్టాలని రెండురోజుల కిందట మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ పనులను మొదలు పెట్టారు. దీన్ని తెలుసుకున్న ఆ మండల టీడీపీ నేత రంగనాథ్ అక్కడ పనులు చేస్తున్న జేసీబీ డ్రైవర్, పనులు చేసేందుకు వచ్చిన కాంట్రాక్టర్‌ను బెదిరించారు. స్థానిక ఎమ్మెల్యే అమరన్న మాట లేంది ఎలా పనులు చేస్తారంటూ బెదిరించి పనులు ఆపివేశారు. ఇది ఆ గ్రామస్తులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆలయ నిర్మాణ విషయంలోనూ కూటమి నేతల రాజకీయాన్ని జనం సహించలేకపోతున్నారు. ఈ విషయమై మదనపల్లి టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శశికుమార్‌ను వివరణ కోరగా గతంలో చౌడేశ్వరి ఆలయానికి సంబంధించిన ప్రొసెస్ జరిగిన మాట నిజమేనన్నారు. అయితే నోటిఫికేన్ దశలో ఆగిందన్నారు. ఇప్పుడు ఆలయ చైర్మన్ తమశాఖ ద్వారా వద్దని సొంతంగా ఆలయాన్ని నిర్మించుకోవాలంటే స్థానిక ఎమ్మెల్యే విల్లింగ్ అవసరంలేదన్నారు. వారు బ్యాంకులో చెల్లించిన డబ్బు సైతం వెనక్కిరావడం జరుగుతుందని తెలిపారు.

ఆలయ పనులపై పెత్తనం

ఆలయ పనులపై పెత్తనం

ఆలయ పనులపై పెత్తనం