
బైక్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
పలమనేరు : బైక్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలమనేరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానిక కొత్తపేట ముత్తాచారి పాళ్యానికి చెందిన జయరాముని కుమారుడు రారాజు(19) చదువు పూర్తి చేసి మండలంలోని ఓ పాల డెయిరీలో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు బైక్ కావాలని ఇంట్లో వారిని అడిగినట్టు తెలిసింది. అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చాక తీసుకోవచ్చులేనని వారు చెప్పారు. దీనిపై కలత చెంది మంగళవారం వేకువజామున ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొద్దున గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇన్‌చార్జి ఎస్‌ఏఓగా శ్రీనివాసులు
చిత్తూరు కార్పొరేషన్ : ట్రాన్స్‌కో చిత్తూరు జిల్లా ఏఓ ప్రసన్న ఆంజనేయులు పదోన్నతిపై కడప జిల్లా ఎస్‌ఏఓగా బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో తిరుపతి జిల్లా ఎస్‌ఏఓ శ్రీనివాసులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎండీ సంతోషరావు ఉత్తర్వులు జారీ చేశారు.
మద్యం మత్తులో మహిళపై దాడి
గంగాధర నెల్లూరు : మండలానికి చెందిన ఓ మాజీ సైనికుడు మద్యం మత్తులో కట్టకిందపల్లి గ్రామంలోని మహిళపై తీవ్రంగా దుర్భాషలాడి చేయిచేసుకుని అడ్డొచ్చిన బంధువులపై దాడి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల మేరకు.. కట్టకింద పల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు రజిని మద్యం తాగి గ్రామంలోని చిన్నమ్మ అనే మహిళను తీవ్రంగా దుర్భాషలాడాడి ప్రశ్నించిన మహిళపై చేయి చేసుకోగా అడ్డొచ్చిన గ్రామస్తులపై దాడి చేశారని తెలిపారు. చిన్నమ్మకు సహాయంగా వచ్చిన గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్, చిరంజీవి, రాజా, వెంకటేష్‌పై రజిని,అతని సహాయకులు దాడికి పాల్పడగా తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. చిన్నమ్మ కుమార్తె మాధవి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దాడి చేసిన మాజీ సైనికుడు రజినితో పాటు సహచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసంతి తెలిపారు.