
మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడాలి
చిత్తూరు లీగల్ : మానవ అక్రమ రవాణా నివారణకు పోలీస్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో పనిచేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి అన్నారు. మంగళవారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలోని న్యాయసేవా సదన్ భవనంలో పోలీసులు, సీ్త్ర శిశు సంక్షేమశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. చిన్న పిల్లలు, మహిళలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇతర మాయ మాటలు చెప్పి పలుచోట్ల అపహరించి.. ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారన్నారు. కొన్ని ఘటనల్లో అక్రమ రవాణా చేసిన వ్యక్తుల నుంచి అవయవాలు బలవంతంగా సేకరించి విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేరం జరగముందే ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకురావాలన్నారు. అప్పుడే మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందన్నారు.
జర్నలిస్టుల పిల్లలకు
50 శాతం ఫీజు రాయితీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వివిధ సంస్థల్లో పనిచేస్తున్న అక్రిడియేషన్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో 50 శాతం రాయితీ కల్పించాలని చిత్తూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రమేష్‌బాబు, కార్యదర్శి కాళేశ్వర్‌రెడ్డి కోరారు. మంగళవారం ప్రెస్‌క్లబ్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని కలిసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే 50 శాతం ఫీజు రాయితీ ఉత్తర్వులను జారీ చేసేలా చర్యలు చేపట్టాలని డీఆర్‌వో, డీఈవోలను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు, ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.