
వివాహిత ఆత్మహత్యాయత్నం
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని పట్రాంపల్లెలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల ఘర్షణలో కలత చెందిన ఓ వివాహిత విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పట్రాంపల్లెకు చెందిన రామ్మూర్తి, సతీష్ కుటుంబానికి ఆర్థికపరమైన గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రామ్మూర్తి భార్య తారక అనే మహిళపై సతీష్ కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాలు గొడవ పడడంతో.. కలత చెందిన తారక విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే స్థానికులు ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. టూటౌన్ పోలీసులు విచారిస్తున్నారు.
బకాయిలు వసూలు చేయండి
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా పరిధిలో ఎస్సీ, ఎస్టీ బకాయిల మీద దృష్టి పెట్టాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం అర్బన్ డివిజన్ కార్యాలయంలో ఈఈ మునిచంద్ర, ఈఆర్‌ఓ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ సర్వీస్ ధరలకు ప్రభుత్వం ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్ ఇస్తోందన్నారు. 200 యూనిట్లు దాటినవారు బిల్లు చెల్లించాలన్నారు. కానీ పలువురు బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఎక్కువగా చిత్తూరు రూరల్, జీడీనెల్లూరు ప్రాంతాల్లో ఈ సమస్య ఉందన్నారు. ఆ సర్వీసుల పెండింగ్ అమౌంట్ వసూలు చేయాలన్నారు. డివిజన్ పరిధిలో డిస్ కనెక్ట్ అయిన 163 సర్వీస్‌ల నుంచి పెండింగ్ మొత్తం రాబట్టాలన్నారు. లేనిపక్షంలో ఆ సర్వీసులను రద్దు చేయాలన్నారు.
ఒకరికి పదేళ్ల జైలు
పుంగనూరు: పాత కక్షలు పెంచుకొని యువకుడిని కత్తితో పొడిచిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ మదనపల్లె 7వ అదనపు జిల్లా జడ్జి శ్రీలత తీర్పునిచ్చారు. సోమవారం పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు పట్టణం, నక్కబండలో 2022 జూన్ 25న అదే ప్రాంతానికి చెందిన టీ.రెడ్డెప్ప కుమారుడు రాజా అలియాస్ తోటి రాజేష్ స్థానిక ఇస్లాం నగర్‌కు చెందిన ఫారుక్‌తో ఓ అమ్మాయి విషయమై గొడవ పడ్డాడు. ఆపై నక్కబండ వద్ద జరిగిన పంచాయితీలో ఫారుక్ ను చంపాలనే ఉద్దేశంతో తన వద్ద ఉన్న కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై అదేరోజు అప్పటి ఎస్‌ఐ మోహన్‌కుమార్ కేసు నమోదుచేసి రాజా అలియాస్ తోటి రాజేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 28న మదనపల్లె 7వ అడిషనల్ జిల్లా కోర్టులో న్యాయమూర్తి శ్రీలత తీర్పు ప్రకటించారు. రాజా అలియాస్ రాజేష్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం