మామిడి కొను‘గోల్‌మాల్‌’! | - | Sakshi
Sakshi News home page

మామిడి కొను‘గోల్‌మాల్‌’!

Jul 29 2025 8:02 AM | Updated on Jul 29 2025 8:58 AM

మామిడి కొను‘గోల్‌మాల్‌’!

మామిడి కొను‘గోల్‌మాల్‌’!

● పక్కదారి పడుతున్న ప్రభుత్వ ప్రోత్సాహ నిధి ● వే బిల్లులు సృష్టించి యథేచ్ఛగా దందా! ● పట్టించుకోని ఉద్యానశాఖ అధికారులు

మామిడి రైతుల అవస్థలను కొందరు కూటమి నేతలు తమకు అనుకూలంగా మాలుచు కుంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహక నిధిని పక్కదారి పట్టించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఇందులో భాగంగానే తొలుత తమిళనాడు రాష్ట్రానికి చెందిన కాయలను తెచ్చి జిల్లాలో అమ్మకానికి పెట్టారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వే బిల్లుల పేరుతో మోసాలకు తెరలేపారు. ఫ్యాక్టరీలో కాయలు దింపకనే వే బిల్లులు సృష్టించి ప్రభుత్వ ప్రోత్సాహక నిధికి తూట్లు పొడుస్తున్నారు. దీనికితోడు నీలం కాయలను సైతం తోతాపురి లెక్కల్లోకి తీసుకుంటున్నారు. దీనిపై ఉద్యానశాఖ అధికారులు నోరెత్తకపోవడాన్ని రైతులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

కాణిపాకం: జిల్లా వ్యాప్తంగా మామిడిలో తోతాపురి రకం 39,895 హెక్టార్లలో సాగులో ఉంది. మొత్తం ఈ సారి 4.99 లక్షల టన్నుల దాకా దిగుబడి వచ్చినట్టు అధికారుల అంచనా. ఈ పంట అధిక దిగుబడి కారణంగా కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం తోతాపురి కిలోకి రూ.12 మద్దతు ధర ప్రకటించింది. ఈ ధరలో ఫ్యాక్టరీలు కేజీకి రూ.8 ఇస్తే.. ప్రభుత్వ ప్రోత్సాహ నిధి కింద కేజీకి రూ.4 చొప్పున్న చెల్లిస్తామని వెల్లడించింది. ఇదే అదునుగా భావించి కొందరు వ్యక్తులు, కూటమికి చెందిన పలువురు నేతలు ఆ ప్రోత్సాహక నిధిని దోచుకునేందుకు కుట్రలు పన్నుతున్నారు.

ఆ కాయలు ఏమయ్యాయి?

ప్రతి ఏటా మామిడి పంట ఆరంభంలోనే వ్యాపారులు తోటపై వాలిపోతుంటారు. రైతులకు అడ్వాన్స్‌లు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుని వెళ్లిపోతుంటారు. తమిళనాడుకు చెందిన వ్యక్తులే అధిక శాతం మంది ఈ వ్యాపారం చేస్తుంటారు. వీరు ఈ సారి తీవ్రంగా నష్టపోయారు. తోటపై కొనుగోలు చేసిన కాయలను అమ్ముకోలేక తలలు పట్టుకున్నారు. వీరికి కొందరు కూటమి నేతలు వల వేశారు. కాయలను అమ్మిచ్చే బాధ్యతను తీసుకున్నారు. ఆ కాయలను ఫ్యాక్టరీలకు దగ్గరుండి తరలించి.. ప్రోత్సాహక నిధిని వీళ్ల ఖాతాల్లోకి మళ్లించుకునేందుకు కుట్రలు పన్నారు.

ఒకే ట్రాక్టర్‌ పేరుతో పలు బిల్లులు

ఒకే ట్రాక్టర్‌..ఒకే రోజు పలు లోడ్లు తరలించి ప్రోత్సాహక నిధికి బిల్లులు సమర్పించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు పలు ర్యాంపులు కేంద్ర బిందువుగా మారినట్టు విమర్శలు గుప్పుమంటున్నాయి. ఒకే ట్రాక్టర్‌ పలు ర్యాంపుల వద్దకు వెళ్లి కాయలను తూకం మేసి.. దింపకుండా.. బిల్లులు సృష్టించుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదంతా ప్రభుత్వం అందించే రూ.4 ప్రోత్సాహక నిధి కోసమేనని రైతులు ఆరోపిస్తున్నారు. ర్యాంపుల వద్ద వచ్చిన ఆధార్‌, బ్యాంకు ఖాతా, వే బిల్లులను తీసుకొచ్చి సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారనే విషయం జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటివి కుప్పం, వి.కోట, పలమ నేరు, సోమల ప్రాంతాల్లో జరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ఉద్యానశాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

నీలంతో ఏంపని?

దందా ఇలా

మామిడి అవస్థలను కొందరు కూటమి నేతలు తమకు అనుకూలంగా మార్చుకుని క్యాష్‌ చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రజాప్రతినిధుల పేరు చెప్పుకొని టోకన్లను సైతం అమ్ముకున్నట్టు తెలుస్తోంది. అధికారుల రంగ ప్రవేశంతో దీనిని కట్టడి చేశారు. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రం నుంచి తోతాపురి మామిడిని జిల్లాలోని ఫ్యాక్టరీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. మామిడి పంటే లేని వ్యక్తులు అక్కడి కాయలను తీసుకొచ్చి జిల్లాలోని ఫ్యాక్టరీలో విక్రయానికి పెట్టారు. ఇలా సుమారు 60 వేల మెట్రిక్‌ టన్నుల నుంచి 90 వేల మెట్రిక్‌ టన్నుల కాయలు ఫ్యాక్టరీల్లోకి దింపినట్టు రైతులు చెబుతున్నారు. ఈ దందాలో కూటమికి చెందిన పలువురు కార్యకర్తలు ముందు వరుసలో నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాత పోలీసులు అప్రమత్తమై తమిళనాడు సరిహద్దులో నిఘా పెట్టారు.

మూడు రోజుల క్రితం వరకు 26,221 మంది రైతులు 2,26,660 మెట్రిక్‌ టన్నుల కాయలను ఫ్యాక్టరీలకు విక్రయించారు. ర్యాంపుల ద్వారా 14,637 మంది రైతులు 1,01,175 టన్నుల కాయలను విక్రయించినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే తోతాపురి పంట దాదాపు పూర్తికావొచ్చింది. ఇప్పుడు నీలం రకం కాయలు మాత్రమే కోతలు, అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిని కొన్ని ర్యాంపుల్లో తోతాపురి లెక్కల్లోకి నెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా పలువురు ర్యాంపు నిర్వాహకులు నేర్పుతున్న పాఠమని రైతులు అంటున్నారు. దీనిపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే ఈ రకమైన దందా నడుస్తోందని, ప్రభుత్వం అందించే రూ.260 కోట్లలో.. రూ.50 కోట్లు మామిడిలో జరిగిన దందాకు సరిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే మామిడి దందా బట్టబయలవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement