
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి!
● ఊరుగాని ఊరులో అనాథగా మట్టిలో కలిసిన కన్నడ వాసి ● కన్నీరుమున్నీరైన కుటుంబీకులు
పలమనేరు: ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఏ మట్టిలో కలిసిపోతామో తెలియని మానవ జన్మ ఇది. ఇలాంటిదే పలమనేరులో చోటు చేసుకుంది. కర్ణాటక వాసి ఇక్కడ అనాథలా మృతిచెందడం.. ఆపై మట్టిలో కలిసిపోవడం చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. వివరాలు.. ఈనెల 23వ తేదీన పలమనేరు సమీపంలోని పత్తికొండ వద్ద హైవేకి సమీపంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గంగవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆపై బంధువుల రాక కోసం మూడు రోజుల దాకా వేచి చూశారు. కానీ ఎవ్వరూ రాకపోవడంతో స్థానిక హెల్పింగ్ హ్యాండ్స్ వారిద్వారా అంతిమ సంస్కారాలకు అప్పగించారు. వారు పట్టణంలోని హరిశ్చంద్ర శ్మశానవాటికలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
అయ్యో..అనాథలా వెళ్లిపోయావా నాయనా?
ఇలా ఉండగా మృతుని బంధువులు సోమవారం పోలీసుల వద్దకు వచ్చారు. తాము కోలారు జిల్లా, ఈకాంబలి గ్రామానికి చెందిన వారమని, మృతుని పేరు బత్తెప్ప(55) అని తెలిపారు. ఈనెల 23 నుంచి కనిపించకపోవడంతో కోలారు పీఎస్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఆయనకు కాలు దెబ్బతగిలి బాధతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని, దీనిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ఆయన అనాథ కాదని, కుటుంబీకులున్నారంటూ బంధువులు బోరున విలపించారు.
ఇక్కడే పెద్ద ఖర్మ చేస్తాం
అనంతరం హెల్పింగ్‌హ్యాండ్స్ నిర్వాహకులు శివ మిత్ర బృందంతో మాట్లాడారు. వారు మృతదేహానికి ఎలా అంత్యక్రియలు నిర్వహించారో విడియో చూపెట్టారు. దినిపై సంతృప్తి చెందిన కుటుంబీకులు ఆయన ఇక్కడి మట్టిలో కలవాలని దేవుడు రాశాడని.. పెద్దఖర్మ కూడా ఇక్కడే చేస్తామని తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులకు చేతులు జోడింది కృతజ్ఙతలను తెలియజేశారు. ఈ ఘటన స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది.

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి!