
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
● చికిత్స కంటే నివారణే మేలు ● ప్రతి శుక్రవారం కచ్చితంగా డ్రై డేని పాటించాలి ● మామిడి రైతులకు రూ.150 కోట్ల సబ్సిడీ ● సమావేశాల్లో కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన వరుస సమావేశాలను నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని డెంగ్యూ కేసులు నమోదైనట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే అమలు చేయాలన్నారు. అనంతరం జాతీయ డెంగ్యూ నివారణ మాసాన్ని పురస్కరించుకుని అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుధారాణి, జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు పాల్గొన్నారు.
పకడ్బందీగా మామిడి సబ్సిడీ పంపిణీ
జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులకు రూ.150 కోట్ల సబ్సిడీని అందజేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మామిడి సబ్సిడీ అందజేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటి వరకు సేకరించిన మామిడికి కిలో రూ.4 చొప్పున సబ్సిడీ అందజేయనున్నట్లు తెలిపారు. ఆగస్టులో సంబంధిత రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ నగదు జమచేస్తామన్నారు. 2.25 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికి సంబంధించి 28,370 మంది రైతుల డేటాను పరిశీలన నిమిత్తం మండల స్థాయి బృందాలకు పంపినట్టు తెలిపారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ, మార్కెటింగ్ ఏడీ పరమేశ్వరన్ పాల్గొన్నారు.