
పోటీతత్వంతో ముందుకు సాగాలి
● రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు 28 మంది ఎంపిక
చిత్తూరు కలెక్టరేట్ : పోటీల్లో పాల్గొనే విద్యార్థులు, క్రీడాకారులు పోటీతత్వంతో ముందుకు సాగాలని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు సెక్రటరీ యుక్తాచౌదరి అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మెసానికల్ మైదానం ఇండోర్ స్టేడియంలో సోమవారం జిల్లా స్థాయి యోగాసన క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి 236 మంది విద్యార్థులు, యోగా క్రీడాకారులు పాల్గొన్నారు. పాల్గొన్న వివిధ వయస్సుల క్రీడాకారులు యోగా పోటీల్లో వివిధ ఆసనాలను వేశారు. జిల్లా స్థాయిలో 28 మంది గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు యుక్తాచౌదరి మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న యోగాను మరింత అభివృద్ధి చేసేందుకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీలకు బాపట్ల జిల్లా నుంచి విచ్చేసిన సంతోష్‌కుమార్ అబ్జర్వర్‌గా వ్యవహరించారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన యోగా క్రీడాకారులు త్వరలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు. ఈ పోటీల్లో అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షులు మురళీమోహన్ పాల్గొన్నారు.