
ఉచిత శిక్షణ.. ఉద్యోగ అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ నర్సింగ్ గ్రాడ్యుయేట్లకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ శిక్షణ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ శిక్షణ కార్యక్రమం పట్ల క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 7వ తేదీ ఆఖరు అని చెప్పారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్‌వో మోహన్‌కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డీడీ విక్రమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.