
జంతువులకున్న విలువ మనుషులకు లేదా..?
సోమల(సదుం): జంతువులకు వున్న విలువ మనుషులకు లేదా అని సోమల మండలం కొత్తూరు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తూరులో శనివారం రాత్రి ఏనుగుల దాడిలో రామకృష్ణమరాజు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన మృతదేహంతో ఆదివారం ఉదయం వరకు రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ శనివారం సాయంత్రం 5 గంటలకు ఏనుగుల దాడిలో మనిషి మృతిచెందాడని, రాత్రి 10 గంటల వరకు అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవిలో జంతువులు చనిపోతే హుటాహుటిన వచ్చే అధికారులు మనుషులు చనిపోతే పట్టించుకోరా అని ఆవేదన వ్యక్తం చేశారు. కుంకీ ఏనుగులు ఎక్కడని నిలదీశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తమ గ్రామానికి రావాలని, అంతవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని భీష్మించారు. సంవత్సరాల తరబడి ఏనుగులు పంటలపై దాడులు చేసి నష్టం చేస్తున్నాయని వాపోయారు. సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పంటలు నష్ట పోతున్నా రూ.10 వేలు పరిహారం చెల్లిస్తున్నారని తెలిపారు. తాము వ్యవసాయం వదులుకోవాల్సిందేనా అంటూ వాపోయారు.
పరిశీలించిన డీఎఫ్‌వో:
ఏనుగుల దాడిలో వ్యక్తి మృతిచెందిన ప్రాంతాన్ని ఆదివారం ఉందయం డీఎఫ్‌వో భరణి పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూడు నెలల పాటు రైతులెవరూ సాయంత్రం 4 గంటల అనంతరం అటవీ సరిహద్దుల్లో ఉన్న పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు. తేనె టీగలను పెంచుకుంటే ఏనుగుల దాడులను అరికట్టవచ్చని, రైతులకు ఆదాయం చేకూరుతుందని చెప్పారు. ఆమె హామీతో రామకృష్ణంరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పుంగనూరుకు తరలించారు.