
పోలీసు శాఖపై ఆ వ్యాఖ్యలు సరికావు
చిత్తూరు అర్బన్: చిత్తూరు ఎస్పీ, పోలీసు శాఖపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు సరికావని జిల్లా పోలీసు సంక్షేమ సంఘ నాయకులు తెలిపారు. అభ్యంతరకరమైన, వ్యక్తిగత ధూషణ లాంటికి కాకుండా హుందాగా వ్యవహరించాలన్నారు. చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఆదివారం ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, కోశాధికారి పరంధామనాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి ఖాదర్‌బాషా, సభ్యుడు శరవణ పాల్గొని మీడియాతో మాట్లాడారు. పోలీసు శాఖపై వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు.
ఈ ప్రశ్నలకు మౌనం!
ఎస్పీపై వైఎస్సార్‌సీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్న పోలీసు యూనియన్ నాయకులను ‘సాక్షి’ అడిగిన ప్రశ్నలకు నీళ్లు నములుతూ మౌనం వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్‌ఐ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు 200 మందికి పోస్టింగులు ఇవ్వకుంటే యూనియన్ ఎందుకు మౌనంగా ఉందని అడిగితే.. అది రాష్ట్ర యూనియన్ చూడాలన్నారు. పుంగనూరులో ఓ టీడీపీ కార్యకర్త హత్యకు గురైతే ఏకంగా కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఎస్పీ మణికంఠ వల్లే ఈ హత్య జరిగింది...’ అంటూ హత్యారోపణ చేస్తే ఎందుకు యూనియన్ నోరు మెదపలేదని అడిగితే నీళ్లు నలిమిలారు. అందుకే 200 మందికి పైగా సిబ్బందిని బదిలీ చేశారని దాటవేసే సమాధానం చెప్పారు.
శ్రీవారిసేవలో సీఎస్
తిరుమల : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదివారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్‌ను ఈవో జె.శ్యామలరావు అందజేశారు.