
టమాటకు రెక్కలు!
● పలమనేరులో బాక్సు ధర రూ.650
పలమనేరు : టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. ఆదివారం పలమనేరు హార్టికల్చర్ డివిజన్‌లో బాక్స్(14కేజీలు) టమాట ధర ఒక్కసారిగా రూ.500 నుంచి రూ.650కి చేరింది. మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, తెలంగాణలో పంట తగ్గుముఖం పట్టడం, తమిళనాడులో సీజన్ ముగియడం, కర్ణాటలో తెగుళ్ల కారణంగా దెబ్బతినడంతో బయటి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు భారీగా వస్తున్నారు. దీంతో టమాట ధర పెరుగుతోందని స్థానిక వ్యాపారులు వెల్లడిస్తున్నారు. ఈక్రమంలో ప్రస్తుతం పంట కోతల్లో ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన లోడ్లు
పలమనేరు, పుంగనూరు, వి.కోట, సోమల, సదుంలోని టమాట మారె్‌క్‌ట్‌లకు సాధారణంగా రోజూ వంద లోడ్ల సరుకు రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 60 లోడ్ల టమాట మాత్రమే వస్తోంది. ఇదే సమయంలో డిమాండ్ అధికంగా ఉండడంతో టమాట రేటు ఒక్కసారిగా పుంజుకుంది.
మొదలైన ఎగుమతులు
ప్రస్తుతం జిల్లా నుంచి బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, సౌత్ ఆఫ్రికా దేశాలకు టమాటను ఎగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో నాణ్యమైన టమాటకు డిమాండ్ అమాంతం పెరిగింది. మొన్నటి దాకా బాక్సు రూ.200 పలికిన టమాట, ఇప్పుడు బాక్సు రూ.650కి చేరుకుంది. ఇక ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ కాయలైతే ధర రూ.700 పైగా చేరింది. మరో నెలపాటు టమాట ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.