
● జిల్లాలో యథేచ్ఛగా ట్రావెల్స్ దందా ● తప్పుడు పత్రాలతో
జిల్లాలో ట్రావెల్ నిర్వాహకులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. ఒకే నంబర్‌తో రెండు.. మూడు బస్సులను నడుపుతున్నారు. తప్పుడు పత్రాలతో ఇష్టారాజ్యంగా సర్వీసులను తిప్పుతున్నారు. నకిలీ రశీదులతో ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. ప్రయాణికులను మాత్రమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా భారీ లగేజీలను తరలించేస్తున్నారు. అలాగే వాహనాలను ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించి ఇక్కడ చెల్లించాల్సిన పన్నుకు పంగనామాలు పెట్టేస్తున్నారు. రవాణాశాఖ అధికారులను బురిడీ కొట్టించి ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. కేసులకు సైతం వెరవకుండా బరితెగించి మరీ బస్సులను నడిపేస్తున్నారు.
● రెండు రోజులకు క్రితం బెంగళూరు–విజయవాడ ట్రావెల్స్ బస్సును జిల్లా రవాణాశాఖ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో బండికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పన్ను చెల్లించిన రిశీదు అడిగారు. డ్రైవర్ వెంటనే పన్ను కట్టినట్లు రశీదును చూపించారు. అయితే ఆ బిల్లు నకిలీది అని తేలింది. పన్ను కట్టిన పాత పత్రంలో తేదీ మార్చినట్లు చూపించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో కోకొల్లలుగా జరుగుతున్నాయి.
● ఇటీవల బెంగళూరు–తిరుపతి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ను చిత్తూరులో జిల్లా రవాణాశాఖ అధికారులు పట్టుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఆన్‌లైన్ ద్వారా బస్సు వివరాలను చూస్తే పట్టుబడిన బండిని విజయవాడలో సీజ్ చేసినట్లు తేలింది. దీంతో రవాణాశాఖ అధికారులు లోతుగా విచారించారు. విజయవాడలోని అధికారికి ఈవిషయంపై సమాచారం అందించారు. కేసు నమోదు చేయించారు. చిత్తూరు నగరంలో సీజ్ చేసిన బస్సు నంబరుతో విజయవాడలోనూ మరొకటి తిరుగుతూ పట్టుబడినట్లు తేలింది.
పలమనేరు : కర్ణాటక ఆర్టీసీ బస్సులు ఎలాంటి పర్మిట్ లేకుండానే జిల్లాలో తిరుగుతున్నాయి. ప్రధానంగా తిరుపతి, పలమనేరు, చిత్తూరు, పుత్తూరుకు అధిక సంఖ్యలో బస్సులు నడుపుతున్నాయి. బెంగళూరు, కోలారు, ముళబాగిళు, శ్రీనివాసపుర డిపోలనుంచి రిజర్వులో ఉన్న బస్సులను సైతం అంతర్రాష్ట్ర పర్మిట్లు లేనప్పటికీ తిరుపతి వెళ్లువారు అధికంగా ఉంటే స్పెషల్ ట్రిప్పులు వేస్తున్నాయి. ఫలితంగా మన ఖజానాకు గండిపడుతోంది.
జిల్లా నుంచి 125 సర్వీసులు
ఉమ్మడి జిల్లాలోని తిరుపతి, మంగళం, తిరుమల, చిత్తూరు తదితర డిపోలనుంచి బెంగళూరుకు 125 దాకా అంతర్రాష్ట్ర సర్వీసులు నడుస్తున్నాయి. వీటికి పక్కాగా పర్మిట్ తీసుకున్నారు. అయితే కర్ణాటక నుంచి దాదాపు 70 బస్సులు జిల్లాకు వస్తున్నాయి. వీటిలో చాలా సర్వీసులకు పర్మిట్‌లు లేవు. జిల్లా రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో కర్ణాటక ఆర్టీసీ బస్సులు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి.
అడిగే దిక్కులేదు...
పలమనేరు, చిత్తూరులకు పొరుగునే ఉన్న ముళబాగిలు, కోలార, చింతామణి, శ్రీనివాసపురం నుంచి రాత్రి సర్వీసులు పదికి పైగా బస్సులు పర్మిట్లు లేకుండానే బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సులను గమనించి పలమనేరు, చిత్తూరు డిపోలకు చెందిన ఆర్టీసీ అధికారులు పలుమార్లు అడ్డుకున్నారు. అయితే వాటిపై చర్యలు తీసుకోవాల్సింది రవాణాశాఖ కాబట్టి ఆర్టీసీ వారు వీటిని నిలువరించలేక వదిలేశారు. దీంతో మరింత రెచ్చిపోయిన కర్ణాటక ఆర్‌టీసీ అధికారులు పర్మిట్ లేని బస్సులను రెట్టింపుచేసి జిల్లాలోకి పంపుతున్నారు.
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో ప్రైవేటు బస్సుల దొంగాట ముదిరింది. ట్రావెల్స్ నిర్వాహకులు పన్నులు ఎగొట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. తప్పుడు పత్రాలతో రయ్..రయ్‌మంటూ బస్సును నడుపుకుంటున్నారు. లగుజీలను సైతం తరలించేస్తున్నారు. ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. రవాణాశాఖ అధికారుల కంట్లో కారం కొడుతున్నారు. అప్పుడప్పుడు అధికారుల తనిఖీలో ఈ దందా వెలుగుచూస్తోంది.
పన్నుకు పంగనామాలు
జిల్లాలో ఒకప్పుడు 90కి పైగా ప్రైవేటు బస్సులున్నాయి. ప్రస్తుతం 40 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. జిల్లాకు సంబంధించిన బస్సులు బెంగళూరు నుంచి తిరుపతికి 10 నుంచి 15 తిరుగుతున్నాయి. అలాగే కర్ణాటక నుంచి 70– 75 బస్సులు తిరుపతి, విజయవాడకు రాకపోకుల సాగిస్తున్నాయి. తమిళనాడు నుంచి 50– 60 సర్వీసులు తిరుపతికి చిత్తూరు మీదుగానే నడుస్తున్నాయి. వీటిలో పలు బస్సులు పన్నుకు పంగనామాలు పెడుతున్నాయి. పన్ను భారం నుంచి బయట పడేందుకు చాలా వరకు అరుణాచల్‌ప్రదేశ్, నాగలాండ్ రాష్ట్రాలకు క్యూక డుతున్నాయి. ఆరాష్ట్రాల్లో పన్ను తక్కువ కావడంతో అక్కడ రిజిస్ట్రేషన్ చేసేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఇక్కడ ఒక్కో బస్సుకు కనిష్టంగా రూ.90వేలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే అక్కడ కేవలం రూ.20వేలు పన్ను చెల్లిస్తే నేషనల్ పర్మిట్‌తో బస్సు తిప్పుకునే అవకాశముంటుంది. దీంతో జిల్లాలో రిజిసే్‌ట్రషన్ చేసుకునే బస్సుల సంఖ్య భారీగా పడిపోయింది. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో తిరిగే బస్సులే జిల్లాలో అధికంగా కనిపిస్తున్నాయి.
ట్యాక్స్ కట్టకుండానే...
చాలా వరకు ప్రైవేటు బస్సులు పన్ను కట్టకుండానే తిరిగేస్తున్నాయి. బయట రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులు ఇష్టానుసారంగా వచ్చి వెళ్లిపోతున్నాయి. నేషనల్ పర్మిట్, ఇతరత్ర పన్నులు లేకుండా జిల్లా మొత్తం తిరుగుతున్నాయి. పన్ను చెల్లింపు గడవు తీరినా.. మళ్లీ చెల్లించకుండా జాప్యం చేస్తున్నాయి. కొన్ని బస్సులు గడువు తీరిన పత్రాల్లో తేదీలు మార్చి పన్ను చెల్లింపునకు ఎగనామం పెడుతున్నాయి. నకిలీ రశీదులతోనే దేశవ్యాప్తంగా తిరిగేస్తున్నాయి. ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. అధికారులు చేపట్టే తనిఖీలో లోతుగా పరిశీలిస్తేనే ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక కొంత మంది మోసగాళ్లు రాష్ట్ర సరిహద్దులో పాగా వేశారు. పన్ను చెల్లింపుదారులను అప్పన్నంగా దోచుకుంటున్నారు. పన్ను చెల్లించినట్లు తప్పుడు రశీదులిచ్చి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కారణాటతో ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 60 లక్ష నుంచి రూ. కోటి వరకు రాష్ట్రానికి పన్ను రూపంలో వచ్చే ఆదాయం ఎగవేతకు గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
నిబంధనల ఉల్లంఘన
చిత్తూరు మీదుగా బెంగళూరు, తమిళనాడు వెళ్లే బస్సులు నిబంధనలు పాటించడం లేదు. ఎక్కడ పడితే అక్కడ బస్సులను ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. ప్రధానంగా లగేజీలను తరలిస్తున్నాయి. ఈ ట్రావెల్స్ బస్సులు లగేజీలను తీసుకెళ్లడానికి అనుమతి లేదు. దీనిపై అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఎక్కడ పడితే అక్కడ ప్రయాణికులను ఎక్కించుకోవడానికి కూడా ట్రావెల్స్‌కు అనుమతి లేదు. రిజర్వేషన్ లేకుండా బండి ఆపిన చోట ప్రయాణికులను ఎక్కించుకుని పోతున్నాయి. వీటిని కట్టడి చేయడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
ఒకే బస్సు పేరుతో..
అలాగే కొందరు బస్సు నిర్వాహకులు పన్ను విషయంలో కక్కుర్తి పడుతున్నారు. ఒకే బస్సు నంబరుతో మరొకటి కూడా నడుపుకుంటున్నారు. ఎక్కువగా ట్రావెల్స్ నిర్వాహకులే ఇలాంటి దందాకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా ఏళ్ల తరబడి ఒకటి రెండు బస్సులకు పన్ను చెల్లింయెకుంటూ మిగిలిన వాటిని అదే నంబర్‌తోనే నడుపుతున్నట్లు అధికారుల విచారణలో బయటపడింది. కొంత మంది పన్ను కట్టకుండా తిరుగుతూ...కేసులు పెట్టించుకుంటున్నారు. ఆ తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి పన్ను చెల్లింపును తగ్గించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక బృందాలతో తనిఖీ
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేశాం. ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా బస్సులను తనిఖీలు చేసేలా ఆదేశాలిచ్చాం. ఈ క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్యాక్స్ ఎగవేతకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వాటిని పసిగట్టి జరిమానా విధిస్తున్నాం. అతిక్రమిస్తే కేసులు పెడుతున్నాం.
– నిరంజన్‌రెడ్డి, డీటీసీ, చిత్తూరు

● జిల్లాలో యథేచ్ఛగా ట్రావెల్స్ దందా ● తప్పుడు పత్రాలతో

● జిల్లాలో యథేచ్ఛగా ట్రావెల్స్ దందా ● తప్పుడు పత్రాలతో

● జిల్లాలో యథేచ్ఛగా ట్రావెల్స్ దందా ● తప్పుడు పత్రాలతో

● జిల్లాలో యథేచ్ఛగా ట్రావెల్స్ దందా ● తప్పుడు పత్రాలతో