
నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని, గైర్హాజరయ్యే వారి పై శాఖాపరంగా చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.
నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.
ఉద్యోగులకు అండగా ఎన్‌జీఓ సంఘం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వోద్యోగులకు అండగా ఎన్‌జీఓ సంఘం ఎల్లప్పుడూ ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవులు తెలిపారు. ఆదివారం ఈ మేరకు చిత్తూరులోని సంఘం కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం తప్పక నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం అబ్జర్వర్ వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా సంఘం అధ్యక్షుడు పెంచలయ్య ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న ఎన్జీఓ సంఘం జిల్లా కార్యదర్శి పదవికి రమేష్‌ను, 14 తాలూకా అధ్యక్ష, కార్యదర్శులను, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
చిత్తూరు అర్బన్: ద్విచక్రవాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ మణికంఠ చందోలు స్పష్టం చేశారు. ఆదివారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో స్లో మోటర్ సైకిల్ రైడింగ్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ విచ్చేసి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ , ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు మరింత అప్రమత్తంగా బండి నడపాలని కోరారు. కచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు భద్రత సూచనలు పాటించపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు సాయినాథ్, చిన్నికృష్ణ, మహబూబ్ బాషా, ట్రాఫిక్ సీఐ నిత్యబాబు, సీఐ మహేశ్వర, నెట్టికంఠయ్య, ఆర్‌ఐ సుధాకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
భక్తులతో కిక్కిరిసిన బోయకొండ
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో ఆదివారం కిక్కిరిసింది. వేకువజాము నుంచే మన రాష్ట్రంతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.మహిళలు ిపిండి, నూనె దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ప్రసాదాలను పంపిణీ చేశారు.
నేడు హుండీ లెక్కింపు
బోయకొండ గంగమ్మ ఆలయంలో సోమవారం ఉదయం 7 గంటలకు హుండీ లెక్కింపు చేపట్టనున్నట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు.

నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక