
స్థానిక సమస్యలపై నిర్లక్ష్యం వీడండి
– జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు
చిత్తూరు కార్పొరేషన్ : స్థానిక సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం వీడాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చైర్మన్ అధ్యక్షతన, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో అధికారులు ఎప్పటిలాగే శాఖలపరంగా మార్పులేని ప్రగతి నివేదికను తెలియజేశారు. పలు సమస్యలపై జెడ్పీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జెడ్పీ పరిధిలోని ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మాణానికి టెండర్లు పిలవాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. మండల స్థాయి అధికారులు తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లను నిర్ణీత సమయంలో శుభ్రం చేయిస్తుండాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విషజర్వాలకు సరైన చికిత్స అందించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్యం సక్రమంగా అందించాలన్నారు. ఈ వర్షాకాలంలో ఇరిగేషన్ అధికారులు నీటి సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. పంచాయతీల్లో విద్యుత్ వృథాను అరికట్టాలన్నారు. యూరియా కోసం రైతులు క్యూలైన్‌లో వేచి ఉన్నారని, సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో ఏనుగుల కట్టడికి సోలార్ పెన్సింగ్ ఏర్పాటుకు జెడ్పీ నిధుల విడుదల చేసినా పురోగతి ఎందుకు కనిపించడం లేదన్నారు.
కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు?
డిసెంబర్ 2023 నుంచి కొత్త పింఛన్లు రావడం లేదని, ఎప్పుడిస్తారని పాలసముద్రం జెడ్పీటీసీ సభ్యుడు అన్బలగన్ అధికారులను నిలదీశారు. కనీసం స్పౌజ్ పింఛన్లకు కూడ అవకాశం కల్పించకపోవడం బాధకరమన్నారు. తల్లికి వందనం పథకం అర్హులైన వారికి కూడా ఎందుకు పడడం లేదన్నారు. వనదుర్గాపురంలోని యూపీ పాఠశాలను 9 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎస్‌ఆర్‌ఎన్ కండ్రిగలో విలీనం చేశారన్నారు. విద్యార్థులు రోజు అంత దూరం ఎలా వెళ్లి చదువుకోవాలని నిలదీశారు. పంచాయతీరాజ్ పరిధిలో ఎన్‌ఆర్‌జీఎస్ ద్వారా చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ పనులకు బిల్లులు ఎప్పుడిస్తారని వడమాలపేట జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్‌రెడ్డి ప్రశ్నించారు. రైతుల వద్ద డబ్బులు కట్టించుకుని వ్యవసాయ సర్వీసులు సకాలంలో ఇవ్వడం లేదని పీలేరు జెడ్పీటీసీ సభ్యుడు రామచంద్రారెడ్డి తెలిపారు. పల్లెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇవ్వడం లేదని ఎర్రవారిపాళెం జెడ్పీటీసీ సభ్యుడు కరుణాకర్‌రెడ్డి తెలిపారు. దీంతో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నారన్నారు. తిరుపతి ఐసీడీఎస్ పీడీ జెడ్పీ సమావేశాలకు ఎందుకు రావడం లేదని సత్యవేడు జెడ్పీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి ప్రశ్నించారు. అంగన్‌వాడీ భవన నిర్మాణాలు పూర్తయిన బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదని శ్రీకాళహస్తి జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటసుబ్బారెడ్డి ప్రశ్నించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ధనంజయరెడ్డి, సీ్త్ర శిశు సంక్షేమ స్టాండింగ్ కమిటీ చైర్మన్ భారతి తదితరులు పాల్గొన్నారు.
ఆ అధికారులకు మెమోలు ఇవ్వండి
కొందరు జిల్లా అధికారులకు జెడ్పీ సమావేశాలు అంటే నిర్లక్ష్యంగా మారిందని జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు సమావేశాలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అటవీశాఖ, ఐసీడీఎస్, డీపీఓ,డీఆర్‌డీఎ, ఎన్‌హెచ్‌ఎఐ, విద్యుత్‌శాఖ అధికారులకు మెమోలు ఇవ్వాలని డిప్యూటీ సీఈఓను ఆదేశించారు.