
పర్యావరణ అనుమతులు తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పనులు అటవీ మార్గాల వైపు వెళితే, తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు ఉండాలని కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్ స్పష్టం చేశారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన శనివారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టాడింగ్ కమిటీ సూచనలను అనుసరించి చిత్తూరు అటవీ డివిజన్ పరిధిలోని 7.1 కిలోమీటర్ల రహదారి పనులు వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా నిర్మించాలన్నారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిబంధనల మేరకు రహదారి నిర్మాణంలో అనుకూలించిన ప్రదేశాల్లో చిన్న ప్రాణులు స్వేచ్ఛగా వెళ్లేందుకు అండర్‌పాస్‌లు నిర్మించాలన్నారు. ప్రత్యేకంగా ఏనుగుల కోసం కర్ణాటక ఆర్టీసీ శాఖ బందిపూర్, నేషనల్ పార్కులో అమలు చేసిన యాంత్రిక రైల్వే అడ్డంకి రూపకల్పనను జిల్లాలో అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. జీవ వైవిద్యాన్ని సంరక్షించుకునేందుకు ఎకో సెన్సిటీవ్ జోన్ పరిధిలో పది మీటర్ల మేరకు వన్యప్రాణుల సంరక్షణకు తక్షణ స్పందన బృందా న్ని ఏర్పాటు చేసు కోవాలన్నారు. రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ శ్రీధర్, అనంతపురం, తిరుపతి కన్జర్వేటర్ యశోదబాయ్, జిల్లా అటవీ శాఖ అధికారి భరణి, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ కార్తీక్ పాల్గొన్నారు.
● కేంద్ర సాధికార కమిటీ సభ్యులు చంద్రప్రకాష్ గోయల్