
వర్గపోరుతో వాస్తవాలు బట్టబయలు
– టీడీపీ నేత గుండయ్య రూ.కోట్లకు పడగలెత్తాడు!
సాక్షిటాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలలకే నాయకుల మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకోవడంతో కొందరు నేతల బండారం బయట పెడతున్నారు. వాస్తవాలను వెల్లడిస్తూ ఒకరిపై ఒకరూ దుమ్మెత్తి పోసుకుంటూ, వారు చేస్తున్న అక్రమాలను బయట పెట్టుకుంటున్న సంఘటన గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో రెండు రోజులుగా కోడైకూస్తోంది. శ్రీరంగరాజపురం మండలంలోని టీడీపీ నాయకుడు గుండయ్య అవినీతి అక్రమాలను అదే పార్టీకి చెందిన పలువురు నాయకులు బయట పెట్టడం చూసి, ప్రజలు విస్తుపోస్తున్నారు. ఒక పేద కుటుంబంలో పుట్టిన గుండయ్యకు రూ.కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని కూటమి నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శనివారం శ్రీరంగరాజపురం ప్రెస్‌క్లబ్‌లో పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకుడు గుండయ్యకు రాణిపేట, తిరుపతి, శ్రీరంగరాజపురంలో జాతీయ రహదారికి ఆనుకుని మూడంతస్తుల భవనాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరుడినని చెప్పుకుంటూ నియోజకవర్గం వ్యాప్తంగా ఫీల్డ్‌అసిస్టెంట్లు, సంఘమిత్రల వద్ధ భారీగా వసూళ్లకు పాల్పడ్డాని ఆరోపించారు. అలాగే పెనుమూరు మండలంలో అంగన్‌వాడీ ఉద్యోగాలను అమ్ముకున్నాడని, నియోజకవర్గం వ్యాప్తంగా గ్రావెల్ మాఫియాకు పాల్పడి, రూ.లక్షల దండుకున్నాడని ఆరోపించారు. ఇవి చాలవన్నట్లు సెటిల్ మెంట్లు చేస్తూ రూ.లక్షల అవినీతికి పాల్పడ్డాడని, అందుకు తగిన రుజువులు తమ వద్ద ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండయ్య చేసిని అవినీతి అక్రమాలపై కేసులు నమోదు చేసి, పేదలకు న్యాయం చేయాలన్నారు. గుండయ్యను వెంటనే పార్టీ నుంచి తొలగించాలని, ఆయన భార్యను కూడా ఏఎంసీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.