
మామిడి రైతులు వివరాలు సరి చూసుకోవాలి
– జిల్లా ఉద్యానశాఖాధికారి మధుసూదన్‌రెడ్డి
బంగారుపాళెం: ఫ్యాక్టరీలకు మామిడికాయలను పంపిన రైతులు వివరాలను సరి చూసుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి సూచించారు. శనివారం బంగారుపాళెంలో వీఆర్వోలు, వ్యవసాయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది మామిడితోటల్లో పండించిన తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు పంపిన రైతుల వివరాలను ఆయా రైతు సేవా కేంద్రం సిబ్బందికి అందజేయడం జరిగిందన్నారు. మామిడి పంటను పంపిన రైతులు ఆయా రైతు సేవా కేంద్రం సిబ్బంది వద్ద తమ వివరాలు, బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్, ఫ్యాక్టరీకి పంపిన కాయల తూకం, ఎన్నిలోడ్లు సరఫరా చేశారనే వివరాలు సరి చూసుకోవాలని తెలిపారు. ఆర్‌బీకే సిబ్బంది ప్రతి రైతుతో మాట్లాడి వారి వివరాలను తెలుసుకుని కచ్చితమైన వివరాలను అందజేయాలని చెప్పారు. ర్యాంప్‌లకు సరఫరా చేసిన రైతుల జాబితా వివరాలను మరో వారం రోజుల్లో రైతు సేవా కేంద్రం సిబ్బందికి అందజేయనున్నట్లు చెప్పారు. తప్పుడు వివరాలు నమోదు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యానశాఖ అధికారి సాగరిక, ఏఓ భారతి పాల్గొన్నారు.