
● మైనింగ్‌శాఖ కార్యాలయంలో ఓ అధికారి ఇష్టారాజ్యం ● అక్రమ
సాక్షి టాస్క్‌ఫోర్స్ : చిత్తూరు నగరంలోని ఎస్టేట్ ప్రాంతంలో జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలో పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ కార్యాలయంలో ఓ అధికారి తీరు మాములుగా లేదు. ఇతను చెప్పిందే వేదంగా నడుస్తోంది. సెటిల్‌మెంట్ విషయంలో ఇతనిదే పైచేయి. అతని అక్రమాలకు ఎవరైనా అడ్డొస్తే...వారి తల మరుగు కావాల్సిందే. ఉన్నతాధికారి కూడా ఆయన ఎక్కడ సంతకం పెట్టాలంటే అక్కడ సంతకం పెట్టాల్సిందేనని శాఖలోని పలువురు ఆరోపిస్తున్నారు.
మంత్రి బంధువునని చెప్పి..
కూటమి అధికారంలోకి వచ్చాక ఆ అధికారి పావులు కదిపాడు. మంత్రి బంధువని చెప్పి..జిల్లా కార్యాలయంలోకి చొరబడ్డాడు. ఉన్నతాధికారిని గుప్పెట్లో పెట్టుకున్నాడు. అతని కార్యకలాపాలకు ఎవరైనా అడ్డొస్తే కూటమి నేతల నుంచి వారికి క్లాస్ పీకిస్తాడు. ఇలా అందరి నోరు మూయించి... వసూళ్లకు అడ్డు తొలగించుకున్నాడు. ఇప్పుడు కార్యాలయంలో ఆయన చెప్పిందే వేదంగా నడుస్తోంది. ఏ పని కావాలన్నా ఆ అధికారి ద్వారానే జరిగేలా చేసుకున్నాడు. కార్యాలయంలో ఆయన పేరు వింటేనే ఉన్నతాధికారి నుంచి సిబ్బంది వరకు హడలిపోతున్నారు. ఆ భయాన్ని బలంగా చేసుకుని ఆ అధికారి ఆడిందే..ఆట.. పాడిందే పాటగా చెలరేగిపోతున్నాడు.
రెచ్చిపోతున్న మాఫియా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. విచ్చలవిడిగా అక్రమ గ్రానైట్ తవ్వకాలు జోరందుకున్నాయి. బంగారుపాళ్యం, చిత్తూరు, జీడీ నెల్లూరు, పాలసముద్రం, యాదమరి తదితర మండలాల్లోని పలు ప్రాంతాల్లో అక్రమ క్వారీ తవ్వకాలు జోరందుకున్నాయి. లక్షల రూపాయలు విలువ చేసే సరుకు (గ్రానైట్ బండ) తమిళనాడుకు తరలుతోంది. ఇదీ తెలిసినా అధికారులు కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోలేకపోతున్నారు. గ్రానైట్ బండలు రాత్రి పూట రయ్..రయ్ మంటూ రోడ్ల మీద కళ్ల ఎదుటే కనిపించినా పట్టించుకోకుండా చూస్తూ.. ఉండిపోతున్నారు. అక్రమాలకు అండగా నిలబడుతున్నారు. దగ్గరుండి హద్దు దాటిస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. మాకు సంబంధం లేదు...అది రెవెన్యూ శాఖ, పోలీసు శాఖ చూసుకోవాలని చేతులెత్తేస్తున్నారు.
మామూళ్లు ముట్టజెప్పాల్సిందే..
జిల్లాలో విలువైన క్వారీలు నడుస్తున్నాయి. ఇందు లో అక్రమ క్వారీలు, అనుమతి తీసుకున్న క్వారీలు కూడా ఉన్నాయి. అనుమతులతో నడుస్తున్న క్వారీల నుంచి ఆ అధికారికి నెలనెలా రూ.50 వేలు ముట్టాల్సిందే. లేకుంటే ఆ అధికారి ఒక్క బండ కూడా క్వా రీ నుంచి కదలకుండా చేస్తున్నారని క్వారీ నిర్వాహకులు చెబుతున్నారు. లేకుంటే అధికార పార్టీ నాయకుల నుంచి వారికి ఇబ్బందులు పెట్టిస్తున్నాడని వా పోతున్నారు. ఇక అక్రమ క్వారీల నుంచి రూ. లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నాడని క్వారీ నిర్వాహకులే బహిరంగంగా చెబుతున్నారు. ఇలా ప్రతి నెల రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు అక్రమ ఆదాయం గడిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ శాఖను పట్టించుకునే వారు లేకపోవడం, ఉన్నతాధికారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ అధికారి వసూళ్లల్లో రైట్ రాయల్‌గా దూసుకెళుతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయానికి అవినీతి చెద పట్టింది. ఓ అధికారి పెత్తనం కార్యాలయంలో పెచ్చుమీరింది. ఆ అధికారి గుప్పెట్లోనే కార్యాలయం నడుస్తోంది. అధికార పార్టీ అండ ఉందని ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాడు. అక్రమ కార్వీలకు ఆజ్యం పోస్తున్నాడు. అడ్డగోలుగా వసూళ్లకు తెరలేపాడు. నెలవారి మామూళ్ల మత్తులో జోగుతున్నాడు. ఉన్నతాధికారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ అధికారి అందిన కాడికి దోచుకుంటున్నాడు. అక్రమ గ్రానైట్ తరలింపునకు దగ్గరుండి సరిహద్దులు దాటిస్తూ అక్రమాలకు ఆలంబనగా నిలుస్తున్నాడు.