
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి : కలెక్టర్
గుడిపాల : రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. బుధవారం గుడిపాల మండలంలోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలోని నంగమంగళం వద్ద ఉన్న రోడ్డు, బ్రిడ్జి, ఎంసీఆర్ క్రాస్ వద్ద, సీఎంసీ ఆస్పత్రి వద్ద ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు పనులను నిర్లక్ష్యంగా చేయడంతో ఇప్పటి వరకు 14 మంది చనిపోగా 46 మంది గాయపడ్డారని ఎస్పీ తెలియజేశారు. వీటన్నింటిని కలెక్టర్ పరిశీలించి సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. మిగిలిన ముఖ్య కూడల్లో రేడియం స్టిక్కర్స్, లైటింగ్, జీబ్రా క్రాసింగ్ లైన్స్, సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత కన్‌స్ట్రక్షన్ వారికి, సీఎంసీ ఆస్పత్రి అధికారులకు ఆయన సూచించారు. సీఎంసీ ప్రతినిధి ప్రిన్స్, గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్ పాల్గొన్నారు.