
29న హుండీ లెక్కింపు
కాణిపాకం : ఈనెల 29వ తేదీన కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీ లెక్కిస్తున్నట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ఆలయ ఆస్థాన మండపంలో ఉదయం 7 గంటలకు హుండీ లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది విధిగా పాల్గొనాలని ఆయన కోరారు.
డైట్ కౌన్సెలింగ్ పొడిగింపు
కార్వేటినగరం : జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్) కౌన్సెలింగ్ 24వ తేదీ వరకు పొడిగించినట్లు డైట్ ప్రిన్సిపల్ వరలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి డైట్ కళాశాలలో నిర్వహించిన డీసెట్ కౌన్సెలింగ్‌ను అభ్యర్థుల సౌకర్యార్థం 24వ తేదీ వరకు గడువు పెంచడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కార్వేటినగరంతో పాటు ప్రైవేటు డైట్ కళాశాలల కోసం 194 సీట్లకు గాను 98 మంది అభ్యర్థులకు మాత్రమే సర్టిఫికెట్ల పరిశీలన జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన సీట్ల కోసం అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే తమ సర్టిఫికెట్లతో జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొని తమకు కేటాయించిన కళాశాలలో చేరాలని సూచించారు. అలాగే మంగళవారం నిర్వహించిన ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనకు తెలుగు మీడియానికి 10 మంది, ఇంగ్లీష్ మీడయానికి 9 మంది అభ్యర్థులు హాజరైనట్లు ప్రిన్సిపల్ పేర్కొన్నారు.
ఉద్యోగ అవకాశాలను
సద్వినియోగం చేసుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి దొణప్ప తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే బ్యూటిఫికేషన్, రిటైల్ కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి ఉన్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడేటాతో ఈనెల 23వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఇతర వివరాలకు 83286 77983, 76710 66532 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
శాస్త్రోక్తంగా ప్రదోషకాల పూజలు
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ప్రదోషకాల పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈసందర్భంగా మూలవిరాట్, నందీశ్వరుడికి ఏక కాలంలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. అనంతరం అలంకరణ చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కార్యక్రమంలో దేవస్థాన ఈఓ పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ కేంద్రాల పరిశీలన
శాంతిపురం : కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం మండలంలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. మండల సచివాలయంలోని తహసీల్దారు కార్యాలయంలో ఎంపీడీవో కుమార్, తహసీల్దార్ శివయ్య, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. మండల కేంద్రం, రాళ్లబూదుగూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిజిటల్ సెంటర్ల పనితీరును పరిశీలించారు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే వారి ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడం ద్వారా సత్వరం మెరుగైన వైద్యం అందించే వీలు కలుగుతుందని చెప్పారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ ఏటీ జీహెచ్ వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 77,481 మంది స్వామివారిని దర్శించుకోగా 30,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.96 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

29న హుండీ లెక్కింపు

29న హుండీ లెక్కింపు