
నేర నిరూపణలో శాఖల సహకారం
● అర్ధ వార్షిక నేర సమీక్షలో ఎస్పీ మణికంఠ ● జేసీ, డీఎఫ్‌వో, డీటీసీ, డీఈవోతో కలిసి సమీక్ష
చిత్తూరు అర్బన్ : నేరం జరిగినప్పుడు దాన్ని చట్టం ముందు నిరూపించడానికి అన్ని ప్రభుత్వ శాఖల సహకారం అవసరమవుతుందని.. దర్యాప్తు అధికారి ఆలోచన చేసి సాక్ష్యాల సేకరణతో నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. ప్రధానంగా భూ ఆక్రమణల్లో రెవెన్యూ, రోడ్డు ప్రమాదాలపై ఆర్‌టీఏ, మెడికో లీగల్ కేసుల్లో వైద్య ఆరోగ్యశాఖ, రోడ్డు ప్రమాదాల్లో ఆర్ అండ్‌బీ, ఎర్ర చందనం లాంటి కేసుల్లో అటవీశాఖతో సమన్వయం అవసరమన్నారు. మంగళవారం చిత్తూరు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో పోలీసుశాఖ అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జేసీ విద్యాధరి, డీఆర్‌వో మోహన్‌కుమార్, డీటీసీ నిరంజన్‌కుమార్ రెడ్డి, డీఎఫ్‌వో భరణి, డీఈవో వరలక్ష్మి ఇతర జిల్లా అధికారులు హాజరై కేసుల దర్యాప్తులో సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖలు పోలీసు శాఖకు సహకరిస్తే అంతిమంగా బాధితుడికి న్యాయం జరగడంతో పాటు దోషులకు కోర్టుల్లో శిక్ష పడుతుందన్నారు. ఇక పోలీసులు స్టేషన్‌కు వచ్చే బాధితులతో ప్రవర్తించే తీరు ఆదర్శనీయంగా ఉండాలన్నారు. సబ్–డివిజన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులపై అధికారులతో చర్చించారు. అటవీ ప్రాంతాల్లో మద్యం తయారీ, ర్యాలీల్లో అసాంఘిక శక్తులను అడ్డుకోవడం, పేకాట లాంటి స్థావరాలపై దాడులు చేయడానికి డ్రోన్లను ఉపయోగించుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, అనవసరమైన లింకులపై క్లిక్ చేయొద్దని, ఓటీపీలు చెప్పొద్దని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
తగ్గిన రోడ్డు ప్రమాదాలు
గత ఆర్నెళ్ల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించగలిగామని, పోలీసుల పనితీరుతోనే ఇది సాధ్యమయ్యిందని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించడం, న్యాయస్థానాలు జారీ చేసే వారెంట్లను అమలు చేయడంపై కూడా చర్చించారు. సమావేశంలో ఎకై ్సజ్ ఈఎస్ శ్రీనివాస్, రైల్వే డీఎస్పీ హర్షిత, పలువురు డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.