
అగ్రిగోల్డ్ ఆస్తులకు మ్యూటేషన్ చేపట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అగ్రిగోల్డ్ ఆస్తులకు మ్యూటేషన్ చేసే ప్రక్రియను ప్రారంభించాలని డీఆర్‌వో మోహన్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అగ్రిగోల్డ్ భూముల మ్యూటేషన్ ప్రక్రియపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్‌వో మాట్లాడుతూ.. జిల్లాలోని వి.కోట, ఐరాల, చిత్తూరు, పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తుల స్థితిగతులను అడిగి తెలుసుకోవాలన్నారు. ఆ ఆస్తులకు సంబంధించి భౌతిక ధ్రువీకరణ పూర్తి చేసి రికార్డులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సబ్ రిజిస్టార్ విలువ, మార్కెట్ విలువ గుర్తింపు చేయాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల మ్యూటేషన్ అంశాలపై పకడ్బందీగా కసరత్తు చేయాలన్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ భూముల పరిస్థితి ఏంటి, ఆక్రమణలు, కోర్టు కేసులు తదితర అంశాలను పరిశీలన చేయాలన్నారు. ఈనెల 24వ తేదీలోగా వ్యవసాయ భూముల మ్యూటేషన్‌ను పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. త్వరలో జేసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆ సమావేశంలో పకడ్బందీగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు.