జిల్లాకు సీజనల్‌ దడ | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు సీజనల్‌ దడ

Jul 23 2025 7:09 AM | Updated on Jul 23 2025 7:09 AM

జిల్ల

జిల్లాకు సీజనల్‌ దడ

● జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులతో చతికిలపడుతున్న ప్రజలు ● కొన్ని మండలాల్లో జ్వరం ప్రభావం అధికం ● ఆస్పత్రులకు క్యూ కడుతున్న రోగులు ● సమయపాలన పాటించని ప్రభుత్వ డాక్టర్లు ● ఆపసోపాలు పడుతున్న పేదలు

‘అమ్మో జ్వరం.. అయ్యో ఒళ్లు నొప్పులు.. జలుబు తగ్గడం లేదు స్వామీ.. దగ్గీ..దగ్గీ పక్కెటెముకులు కూడా నొప్పులురా నాయనా..!’ అంటూ పేద రోగులు అల్లాడిపోతున్నారు. ఒక పక్క వాతావరణంలో మార్పులు.. మరోపక్క అడపాదడపా వర్షాలతో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పారిశుద్ధ్యం పడకేయడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. జ్వరపీడుతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ వైద్యం సక్రమంగా అందక.. ప్రయివేటు ఆస్పత్రులకు క్యూ కట్టాల్సి వస్తోంది. జిల్లాలో సీజనల్‌ వ్యాధులు.. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు.

కాణిపాకం: జిల్లాలోని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల పరిధిల్లో రోజూ 7వేల వరకు ఓపీలొస్తున్నాయి. జి ల్లా, ఏరియా, సీహెచ్‌సీ ఆస్పత్రుల్లో 3,500 వరకు ఓపీలు నమోదవుతున్నాయి. అలాగే ఈ ఆస్పత్రుల్లో 700 వరకు ఇన్‌పేషెంట్లు చేరుతున్నారు. సరైన వై ద్యం అందక చాలా మంది ప్రయివేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. సోమవారం జిల్లాలోని ప్రభు త్వ వైద్యశాలలను ‘సాక్షి’ విజిట్‌ చేసింది. అక్కడ వైద్యులు లేక.. రోగులను పట్టించుకోక చాలా మంది ఇబ్బందులు పడడం కనిపించింది.

వాతావరణంలో మార్పులు

గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం కాసేపు పొడిగా.. ఆ తర్వాత వేడి, సాయంత్ర వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా జిల్లాలో పెద్దగా ఎండలు కనిపించడం లేదు. పలమనేరు, కుప్పం, రామకుప్పం, శాంతిపురం, బైరెడ్డిపల్లి, వీ.కోట, గంగవరం, పుంగనూరు, చౌడేపల్లి మండలాల్లో ఎండ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. చిత్తూరు, బంగారుపాళ్యం, తవణంపల్లి, యాదమరి తదితర మండలాల పరిధిలో కూడా చల్లదన ప్రభావం కనిపిస్తోంది. దీనికితోడు కురిసిన వర్షాలకు దోమల ప్రభావం అధికమవుతోంది.

జ్వరం, జలుబు, దగ్గు అధికం

వీడని జలుబు, దగ్గు తీవ్రతతో రోగులు అల్లాడిపోతున్నారు. విషజ్వరాలు పంజా విసురుతున్నాయి. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రి, ఆరోగ్య కేంద్రాల్లో సరైన చికిత్స అందక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా జ్వరం కేసుల సంఖ్య అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదు. కేవలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులకు వచ్చే కేసుల వివరాలే లెక్కల్లోకి ఎక్కుతున్నాయి. చాలామంది గ్రామాల్లో ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, మెడికల్‌ షాపుల్లో వద్ద మందులు, మాత్రలు తీసుకుని.. మంచానికి పరిమితమవుతున్నారు. జ్వరం తీవ్రత అధికమైతే తప్ప ఆస్పత్రికి వెళ్లడం లేదు. చాలా మంది వైరల్‌ ఫీవర్‌ బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పితో బాధపతున్నారు. మరికొందరు జ్వరం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతూ వైద్యశాలల్లో ఇన్‌న్‌పేషెంట్లుగా చేరుతున్నారు. జ్వరాల బారిన పడిన వారిలో చాలామందికి డెంగీ లక్షణాలు ఉంటున్నాయి.

‘ప్రైవేటు’గా నిలువుదోపిడీ!

జ్వరాలు విజృంభిస్తుండడంతో ఇదే అదునుగా ప్రైవేటు ఆస్పత్రులు బాధితులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. ప్లేట్‌లేట్స్‌ తగ్గాయని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కచ్చితంగా అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని బాధేస్తున్నాయి. చిన్నపాటి జ్వరంతో వెళ్లినా ఐసీయూలో ఉంచి టెస్ట్‌లు, చికిత్స పేరిట వేలల్లో బిల్లులు గుంజేస్తున్నాయి.

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం క్యూలో వేచిమున్న మహిళలు

డాక్టర్లేరి?

జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత వేధిస్తోంది. కొన్ని పీహెచ్‌సీల్లో ఇద్దరు డాక్టర్లు ఉండాల్సి ఉండగా.. ఒకరు మాత్రమే ఉంటున్నారు. మరికొన్ని చోట్ల డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. ఆస్పత్రులకు తోచినప్పుడు వస్తున్నారు. ‘సాక్షి’ విజిట్‌లో బయటపడిన వాస్తవాలు..

● పలమనేరు పరిధిలోని కొలమాసనపల్లి, గంగవరం తదితర మండలాల్లోని పీహెచ్‌సీలకు జ్వరం కేసులు అధికంగా వస్తున్నాయి. ఇక్కడ జ్వరానికి సరైన చికిత్స అందక పలమనేరులోని ఏరియా ఆస్పత్రిని ఆశ్రయించారు.

● చౌడేపల్లి పీహెచ్‌సీలో ఉదయం 10.30గంటల వరకు కూడా డాక్టరు రావడం లేదు. అప్పటి వరకు వచ్చిన కొందరు రోగులు డాక్టర్లు లేరని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లడం కనిపించింది. మరికొందరు సిబ్బంది డాక్టర్ల అవతారమెత్తి రోగులకు చికిత్స చేసి పంపించేశారు.

● నగరి నియోజకవర్గంలోని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో డ్యూటీ డాక్టర్లు డుమ్మా కొట్టడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు నీరసించిపోయారు. అక్కడి స్టాఫ్‌నర్సులు, అటెండర్లే ఆరోగ్య సమస్యలు అడిగి మందులు, మాత్రలు ఇచ్చి పంపించేశారు.

● గంగాధరనెల్లూరులోని పలు పీహెచ్‌సీ డాక్టర్లు విధుల్లో ఉండడం లేదు. ఇష్టానుసారంగా వచ్చి వెళ్లిపోతున్నారు. పేద రోగులు పుత్తూరు, చిత్తూరు ప్రాంతాల్లోని ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.

● జిల్లా కేంద్రం చిత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి కూడా జ్వరం, జలుబు, దగ్గుతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. విషజ్వరాలకు కావాల్సిన కొన్ని రకాల మందులు అందుబాటులో లేవని, బయట తీసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

● తవణంపల్లి మండలంలో విషజ్వరాలతో పాటు డెంగీ కేసులు నమోదవుతున్నాయి.

వైద్యులు ఉండడం లేదు

డాక్టరు ఎప్పుడు వస్తున్నారో..ఎప్పుడు వెళుతున్నారో తెలి యడం లేదు. నర్సులతో చికిత్స అందిస్తున్నారు. డాక్టరు లేకపోతే ఎలా. ఈ ఆస్పత్రికి ఒక డాక్టరును వేస్తే మేలు. మాలాంటి పేదలకు బాగుంటుంది. దగ్గు, జలుబు ఉందని వస్తే..చూసే వాళ్లు లేరు. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాలి.

– ఏకాంబరం, నాయుడుపల్లి,

శ్రీరంగరాజుపురం మండలం

ఇప్పుడు కష్టంలే..!

గతంలో ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఏ మందు లు అడిగినా ఇచ్చేవా రు. డయాలసిస్‌ పే షెంట్‌ కూడా 108 వె హికల్‌లోనే తీసుకెళ్లి డ యాలసిస్‌ అయిన త ర్వాత స్వగ్రామానికి చే రేవారు. ప్రస్తుతం అ లాంటి పరిస్థితి లేదు. మా లాంటివారు డయాలసిస్‌ చేసుకోపోవడానికి వీలుకావడం లేదు. మందులు కూడా అరకురాగానే ఇస్తున్నారు. జ్వరం వచ్చినా పలికేవారు లేరు.

– తంగరాజ్‌, వెంగల్‌రాజు కుప్పం గ్రామం

జిల్లా సమాచారం

జిల్లా ఆస్పత్రి – 1

ఏరియా ఆస్పత్రి – 4

సీహెచ్‌సీలు – 8

పీహెచ్‌సీ – 50

యూపీహెచ్‌సీ – 15

ప్రైవేటు ఆస్పత్రులు – 1,300

ఆర్‌ఎంపీలు – 2 వేల వరకు

పది రోజులుగా ప్రభుత్వాస్పత్రిలో ఓపీలు

దగ్గు, జలుబు – 1,200

0–12 వయస్సు పిల్లల జ్వరం కేసులు – 425

12–40 వయస్సు వారు – 647

40–60 వయస్సు వారు – 502

60 ఏళ్లు పైబడినవారు – 376

జిల్లాకు సీజనల్‌ దడ 
1
1/4

జిల్లాకు సీజనల్‌ దడ

జిల్లాకు సీజనల్‌ దడ 
2
2/4

జిల్లాకు సీజనల్‌ దడ

జిల్లాకు సీజనల్‌ దడ 
3
3/4

జిల్లాకు సీజనల్‌ దడ

జిల్లాకు సీజనల్‌ దడ 
4
4/4

జిల్లాకు సీజనల్‌ దడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement