
ఇంటి దొంగల గుట్టురట్టు
● బోయకొండలో టికెట్ల విక్రయాల్లో దోపిడీ
● ఆరుగురు సిబ్బందిపై వేటు
చౌడేపల్లె : జిల్లాలో రెండో పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంలో ఇంటి దొంగలు చేతివాటం చూపారు. పెద్ద భోగం టికెట్లు విక్రయించే కౌంటర్లలో దోపిడీ చేసి అడ్డంగా దొరికిపోయిన సంఘటన బోయకొండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్టు చప్పుడుగా సాగుతున్న ఈ వ్యవహారం పంపకాల్లో వ్యత్యాసం రావడంతో బట్టబయలైంది. ఈ ఘటనతో బోయకొండ ఆలయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. టికెట్ల విక్రయాల్లో అక్రమాలు చోటు చేసుకోవడంతో ఆలయ ఆదాయానికి గండి పడింది. ఈ ఘటనకు కారకులైన ఆరుగురు సిబ్బందిపై వేటు వేశారు.
అసలేం జరిగిందంటే...
బోయకొండ గంగమ్మకు కోరిన కోర్కెలు తీరిన భక్తులు జంతు బలులు సమర్పించి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు తీర్చడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆలయం వద్ద పెద్ద భోగం ( పొట్టేళ్లు, మేక పోతులు, దున్నపోతులు) చిన్నభోగం కోళ్లు వీటిని అమ్మవారికి బలిస్తారు. పెద్దభోగానికి గాను ఒక్కొక్క దానికి రూ.200 చెల్లించి రశీదు తీసుకొని ఆలయం పై భాగంలో గల పెద్దభోగం, చిన్నభోగం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ అమ్మవారికి పూజలు చేసి తంతు పూర్తి చేసి మొక్కు చెల్లించడం ఆనవాయితీ.
చేతివాటం జరిగింది ఇలా...
పెద్దభోగం టికెట్లు విక్రయించడానికి అధికారులు ఆలయం వద్ద కౌంటర్‌ఽను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ నాలుగు నెలల నుంచి అమలు చేస్తున్నారు. రూ. 200 చెల్లించి టికెట్లు తీసుకెళ్లిన భక్తులకు పూజ చేసి పంపాల్సి ఉంది. మ్యాన్యువల్‌గా టికెట్లు విక్రయిస్తారు. టికెట్టులో అర్ధ భాగం కౌంటర్ ఫైల్‌ను భద్రపరిచి మిగిలిన సగం టికెట్టు భక్తుడుకి ఇవ్వాల్సి ఉంది. ఆషాడ మాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో పాటు ఈనెల 9 వతేదీ సర్వర్ పనిచేయకపోవడంతో మ్యానువల్‌గా టికెట్లు విక్రయం చేపట్టారు. ఈ టికెట్లు విక్రయాల్లో సిబ్బంది చేతివాటం చూపి 213 కౌంటర్ ఫైల్ టికెట్లు చింపి భక్తులకు విక్రయించి రూ.42,600 సొమ్ము చేసుకున్నారని సమాచారం.
పంపకాల్లో తేడాలతో బయటకు..
టికెట్లు చేతివాటం చూపిన సొమ్ములో మనస్పర్థలు రావడంతో విషయం బయటకు వచ్చింది. విషయాన్ని తన దృష్టికి రావడంతో ఏప్రిల్ నుంచి విక్రయించిన టికెట్ల విక్రయాల కౌంటర్ ఫైల్స్ పరిశీలించి అక్రమాలకు పాల్పడింది వాస్తమని తేల్చినట్లు ఈఓ తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన రెగ్యులర్ సిబ్బంది నాగముని, అవుట్ సోర్సింగ్ సిబ్బంది విజయ్‌కుమార్‌రెడ్డి, సోము శేఖర్‌రాజు, మునిశేఖర్, హరిప్రసాద్, ఏ. గంగరాజు అక్రమాలకు పాల్పడినట్లు ఈఓ గుర్తించారు.
ఈఓ ఏమన్నారంటే.....
పెద్దభోగం టికెట్ల విక్రయాల్లో చేతివాటం చూపిన విషయం వాస్తమని బోయకొండ ఈఓ ఏకాంబరం అంగీకరించారు. రెగ్యులర్ సిబ్బంది ఒకరిని సస్పెండ్ చేసి అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించామని చెప్పారు. టెంపుల్ ఇన్‌చార్జి ఇద్దరితో పాటు డీసీఆర్ విధులు నిర్వహించే సిబ్బందికి మెమోలు జారీ చే సినట్లు చెప్పారు. అలాగే ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈఓ పేర్కొన్నారు.
బోయకొండ ఆలయ ముఖచిత్రం

ఇంటి దొంగల గుట్టురట్టు