
వదలబొమ్మాళీ.. వదలా!
● సస్పెండ్ అయినా ఆఫీస్‌లోనే తిష్ట ● హౌసింగ్ శాఖలో ఇన్‌చార్జి పీడీ లీలలు ● కలెక్టర్ రమ్మన్నారంటూ ప్రచారం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా హౌసింగ్ కార్యాలయంలో వింత ధోరణి నెలకొంది. ఆ శాఖ ఇన్‌చార్జి పీడీగా పనిచేస్తున్న గోపాల్‌నాయక్‌పై అవినీతి ఆరోపణలకు గాను సస్పెండ్ చేస్తూ ఈనెల 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌చార్జి పీడీగా పనిచేస్తున్న గోపాల్‌నాయక్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈఈగా పనిచేస్తున్న సమయంలో అవినీతికి పాల్పడినందుకు గాను ఏసీబీ కేసు నమోదైంది. ఆ కేసు విచారణ పూర్తయిన తర్వాత ప్రస్తుతం రాష్ట్ర గృహనిర్మాణ శాఖ అధికారులు ఇన్‌చార్జి పీడీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ప్రభుత్వ జీఓ వెబ్‌సైట్‌లో ప్రచురించింది. సాధారణంగా సస్పెండ్ అయిన తర్వాత సంబంధిత అధికారి సస్పెన్షన్ రద్దు అయ్యే వరకు కార్యాలయానికి వచ్చేందుకు అవకాశం ఉండదు. అయితే కలెక్టరేట్‌లోని హౌసింగ్ కార్యాలయానికి సప్పెండ్ అయిన ఇన్‌చార్జి పీడీ గోపాల్‌నాయక్ నిత్యం కార్యాలయానికి రావడం విమర్శలకు తావిస్తోంది.
కార్యాలయానికి వస్తూ..
రోజూ కార్యాలయానికి వచ్చి నీ పని నీవు చేసుకోమని కలెక్టర్ చెప్పారంటూ పీడీ గోపాల్‌నాయక్ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారం విన్న కలెక్టరేట్‌లోని పలు శాఖల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు సస్పెండ్ అయిన తనకు ఇంకా రాష్ట్ర కార్యాలయం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు రాలేదని బుకాయింపు చేయడం కొసమెరుపు. సస్పెన్షన్ ఉత్తర్వులు కొద్ది రోజుల ముందే పీడీ కార్యాలయం మెయిల్ కు వచ్చినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా ఆ మెయిల్ ను డిలిట్ చేయించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారి అయిన కలెక్టర్ పేరుకు భంగం కలిగే విధంగా సస్పెండ్ అయిన పీడీ వ్యవహరించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
సంతకాలు చేస్తూ..
సస్పెన్షన్ అయిన తర్వాత కార్యాలయానికి రావడమే తప్పు అయితే ఆ పీడీ ఏకంగా సంతకాలే చేయడం విమర్శలకు తావిస్తోంది. సస్పెన్షన్ అయిన అనంతరం కార్యాలయానికి వచ్చి పలు ఫైల్స్‌లో పీడీ సంతకాలు చేయడం జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ను మోసగించడమేనని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విచారణ పూర్తి అయ్యి ఉన్నతాధికారులు సస్పెన్షన్ ను తొలగిస్తే ఆయన తన విధులను తిరిగీ కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ విరుద్ధంగా వ్యవహరించడంపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాగా సస్పెన్షన్ అయిన పీడీ పోస్టును జాయింట్ కలెక్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలుస్తోంది.

వదలబొమ్మాళీ.. వదలా!