
ఎస్వీయూ స్నాతకోత్సవం నిర్వహించండి
తిరుపతి సిటీ: ఎస్వీయూ స్నాతకోత్సవం నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని జీఎస్‌ఎన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు శివ శంకర్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడిని మంగళవారం ఆయన కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ 2022లో 62వ కాన్వికేషన్ నిర్వహించారని, అప్పటి నుంచి కాన్వికేషన్ నిర్వహించకుండా జాప్యం చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. డిగ్రీ, పీజీ పూర్తి అయిన పేద విద్యార్థులు ఇన్ అడ్వాన్స్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ ధ్రువపత్రాలను తీసుకోలేకపోతున్నారని తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు పొందిన విద్యార్థులు ఇంటర్వ్యూలకు కాన్వికేషన్ సర్టిఫికెట్ కోసం వర్సిటీ పరిపాలనా భవనం చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. ఇన్ అడ్వానన్స్ సర్టిఫికెట్ ఫీజులు రూ.వేలల్లో కట్టలేక నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. వెంటనే అధికారులు చొరవ చూపి స్నాతకోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్ నాయక్, సురేంద్ర, రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.