
మామిడి రైతులకు రూ.150 కోట్ల సబ్సిడీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మామిడి రైతులకు ప్రభుత్వం రూ.150 కోట్ల సబ్సిడీని అందజేస్తోందని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు సేకరించిన మామిడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4 చొప్పున సబ్సిడీ అందజేస్తుందన్నారు. ప్రభుత్వం అందజేసే రూ.150 కోట్ల సబ్సిడీని రైతుల ఖాతాలకు జమచేసేలా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. సబ్సిడీ దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మండల అధికారులదేనని స్పష్టం చేశారు. జూన్ నెలాఖరు వరకు సేకరించిన మామిడికి సబ్సిడీ జూలైలో, జూలైలో సేకరిస్తున్న మామిడికి ఆగస్టులో రైతుల ఖాతాలకు జమ చేస్తామన్నారు. జిల్లా స్థాయిలో సేకరించి పంపిన రైతుల వివరాలు, తోతాపురి మామిడి తూకం, తదితర వివరాలను మండల అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు గ్రామస్థాయిలోని విలేజ్ అగ్రికల్చర్, వీఆర్‌వోల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.
ఎలాంటి అలసత్వం వద్దు
క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియలో ఎలాంటి అలసత్వం వహించకూడదని కలెక్టర్ ఆదేశించారు. రైతుల బ్యాంకుల ఖాతాలకు సంబంధించి బ్యాంక్ వివరాలు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఈ క్రాప్‌ను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. 2.25 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి 22,435 మంది రైతుల డేటాను మండల స్థాయి అధికారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. రైతుల జాబితాను తయారు చేసి తహసీల్ధార్ సంతకంతో ధ్రువీకరించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఉద్యానవన శాఖ డీడీ మధుసూదన్‌రెడ్డి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.