
పెద్దిరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే..
పలమనేరు: పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే చంద్రబాబు లిక్కర్ కేసు లో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని ఇరికించారని, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పలమనేరు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో రాష్ట్రంలో 4,380 లిక్కర్ షాపులు ప్రైవేటు వారు నిర్వహించారని చెప్పారు. ఇందులో 40వేల బెల్టుషాపులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 20 డిస్టలరీలు ఉంటే వాటిల్లో చంద్రబాబునాయుడు ఐదింటికి మాత్రం 70 శాతం ఆర్డర్లు ఇచ్చి, మిగిలిన వాటికి 30శాతం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. లిక్కర్ కుంభకోణంలో ఓ టీడీపీ నాయకుడు ఆకాశరామన్న లేఖ రాశాడని దానిపై వారం రోజుల్లోనే విచారణ జరిపి కేసు పెట్టించారన్నారు. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరుగుంటే రూ.26వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఎలా వచ్చిందన్నారు. ఇలాంటి తప్పుడు కేసులకు వైఎస్సార్‌సీపీ నాయకులు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్‌రెడ్డి, నాయకులు దయానందగౌడ, తమీమ్, ప్రహ్లాద, జాఫర్, చలపతి రెడ్డి, చెంగారెడ్డి, మురళీకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, పార్టీ అన్ని విభాగాల నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.