
సమస్యల హోరు.. పరిష్కరించాలి మీరు!
● కలెక్టరేట్‌కు పోటెత్తిన సమస్యలు ● ప్రజాసమస్యల పరిష్కార వేదికకు తరలివచ్చిన అర్జీదారులు ● న్యాయం చేయాలంటూ వేడుకోలు ● వినతులు స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు అర్జీదారులు పోటెత్తారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్‌వో మోహన్‌కుమార్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై 194 వినతులు వచ్చినట్టు కలెక్టరేట్ ఏవో వాసుదేవన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సర్వే చేయించి సమస్య పరిష్కరించండి
సర్వే చేయించి సమస్య పరిష్కరించాలంటూ పెద్దపంజాణి మండలం, అప్పినపల్లి గ్రామానికి చెందిన విజయభాస్కర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో సర్వే నం.226/2లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమి తమ ఆధీనంలో ఉందన్నారు. భాగ పరిష్కారం చేసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలిపారు. ఆ భూమిలో సర్వే చేసి పాసుపుస్తకం మంజూరు చేయాలని కోరారు.
దివ్యాంగులంటే అలుసెందుకు?
కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులంటే అలుసెందుకని దివ్యాంగుల హక్కుల అమలు జిల్లా కమిటీ మెంబర్ చంద్రశేఖర్ ప్రశ్నించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో దివ్యాంగులు నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. డీఆర్‌డీఏ ప్రోత్సాహంతో అవకాశాలు, 50 శాతం రాయితీతో దివ్యాంగులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అర్హులైన దివ్యాంగులతో పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
ఆధార్ కార్డులు లేవు సారూ
తమకు ఆధార్ కార్డులు లేవని, వెంటనే ఇప్పించండి సారూ..! అంటూ గుడిపాల మండలం ఎంకే.పురం, నరిగపల్లికి చెందిన ఒల్లమ్మ కోరారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ తాము ఎస్టీ కులానికి చెందిన వారమన్నారు. తమ కుటుంబంలో ఇంతవరకు ఎవ్వరికీ ఆధార్‌కార్డులు లేవన్నారు. తాను, తన భర్త, ముగ్గురు పిల్లలకు ఆధార్ కార్డులు లేకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామన్నారు. పరిశీలించి ఆధార్‌కార్డు, రేషన్‌న్ కార్డులు ఇప్పించాలని కోరారు.
రూ.60 వేలు లంచం అడుగుతున్నారయ్యా
భూ సమస్య పరిష్కరించాలని కోరగా పెద్దపంజాణి తహసీల్దార్ కార్యాలయంలో రూ.60 వేలు లంచం అడుగుతున్నారంటూ బాధితుడు మార్కొండయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దపంజాణి మండలం, గళ్లావారిపల్లి గ్రామంలో పిత్రార్జితంగా తనకు భూమి ఉందన్నారు. 1బీలోనూ తన పేరు ఉన్నట్లు తెలిపారు. అయితే ఇటీవల 1బీలో తన పేరును తొలగించి వేరే వ్యక్తి పేరు నమోదు చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌వో శంకరప్ప, తలారి రాజన్నను కోరగా.. వారు రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌కు తన సమస్య విన్నవించుకోగా విచారించి న్యాయం చేస్తామని చెప్పారన్నారు.

సమస్యల హోరు.. పరిష్కరించాలి మీరు!

సమస్యల హోరు.. పరిష్కరించాలి మీరు!

సమస్యల హోరు.. పరిష్కరించాలి మీరు!